Los Angeles wildfires : ఆగని కార్చిచ్చు, 10 వేల కట్టడాలు అగ్నికి ఆహుతి
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చుతో ఇప్పటివరకూ పదిమంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10 వేల కట్టడాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. కార్చిచ్చు కారణంగా ఆస్తి నష్టం సుమారు 150 బిలియన్ డాలర్ల(రూ.12.9 లక్షల కోట్లు)కు పెరగొచ్చని ఆక్యూవెదర్ సంస్థ అంచనా వేసింది. 3.6 లక్షల మంది తమ ఇళ్లను ఖాళీ చేశారు. పాలిసేడ్స్ ప్రాంతంలో వేల ఎకరాల్లో మంటలు విధ్వంసం సృష్టించాయి. మంటల్ని అదుపు చేయడానికి అగ్నిమాపక దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. లాస్ ఏంజెలెస్‌లోని కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు తమ విదేశీ పర్యటనల్ని రద్దు చేసుకున్నారు. ఈ విపత్కర పరిస్థితిలో అమెరికాకు సాయమందించేందుకు సిద్ధమని కెనడా ప్రకటించింది.
అగ్నికి ఆహుతయిన బన్నీ మ్యూజియం..
ప్రపంచంలోనే అతిపెద్దదైన బన్నీ(కుందేలు బొమ్మలు) మ్యూజియం ఈ కార్చిచ్చులో పూర్తిగా దగ్ధమైంది. ఇక్కడ దాదాపు 46,000 కుందేళ్ల రూపంలో ఉన్న వస్తువులు మంటల్లో కాలిపోయాయి.
మరుభూమిని తలపిస్తూ..
ఒకప్పుడు సంపదతో తులతూగిన లాస్ ఏంజెలెస్ నగరం నేడు మరుభూమిని తలపిస్తోంది. ఇక్కడ ఎగసిపడుతున్న పొగ, మంటలు అంతరిక్షంలోని ఉపగ్రహాలకు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిన గృహాలు దర్శనమిస్తున్నాయి. మరోవైపు ధనవంతులు, హాలీవుడ్ స్టార్లు వదిలేసి వెళ్లిపోయిన ఇళ్లల్లో విలువైన వస్తువులను దొంగలు దోచుకుంటున్నారు. తాజాగా అక్కడి పోలీసు విభాగం 20 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది.
బీమారంగం కుదేలు
అమెరికా బీమా రంగం కూడా ఈ కార్చిచ్చు దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. జేపీ మోర్గాన్, మార్నింగ్ స్టార్ అంచనాల ప్రకారం 20 బిలియన్ డాలర్ల వరకు బీమా సంస్థలకు నష్టం రావచ్చని పేర్కొంది. కాలిఫోర్నియాలోని అతిపెద్ద బీమా సంస్థ స్టేట్ ఫామ్ కొన్ని నెలల కిందటే పాలిసాడ్స్‌లోని కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు కార్చిచ్చు ముప్పు ఉందని గ్రహించి పాలసీలు ఇవ్వడం మానేసింది. మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో ఆరు నెలల పాటు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుందని అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. శిథిలాల తొలగింపు వంటి చర్యల్లో సాయం చేస్తామన్నారు.
సాన్ ఫెర్నాండో లోయలో మధ్యాహ్నం ప్రారంభమైన కొత్త కెన్నెత్ దావానలం సాయంత్రానికి పక్కనున్న వెంచురా కౌంటీకి వ్యాపించిందని వెల్లడించారు. బలమైన గాలులు తోడు కావడం వల్ల మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని, శుక్రవారం ఉదయానికి ఇవి మరింత బలపడొచ్చని లాస్ ఏంజెల్స్ మేయర్ కరెన్ బస్స్ తెలిపారు. కెన్నెత్ కార్చిచ్చుకు కారణమని భావిస్తున్న నిరాశ్రయుడిని పోలీసులు గురువారం అదుపులోనికి తీసుకున్నారు. మరోవైపు కార్చిచ్చు కారణంగా ఖాళీ అయిన సంపన్నుల ఇండ్లను దోచుకోవడానికి దొంగలు ఎగబడుతున్నారు. ఇప్పటికే 20 మంది దొంగలను అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com