UnitedHealthcare CEO: యునైటెడ్ హెల్త్‌కేర్ CEO హత్యలో అరెస్టయిన 26 ఏళ్ల వ్యక్తి

యునైటెడ్ హెల్త్‌కేర్ సంస్థ సీఈవో బ్రియాన్ థాంప్సన్ కొన్ని రోజుల క్రితం న్యూయార్క్ నగరంలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ కేసులో అమెరికా పోలీసులు ప్రగతి సాధించారు. 26 ఏళ్ల నిందితుడు లుగి మాంగియోన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. పెన్సిల్వేనియాలోని అల్టూనా పట్టణంలో ఉన్న మెక్‌డోనాల్డ్స్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద త్రీడీ ప్రింట్ గన్‌తో పాటు చేయితో రాసిన డాక్యుమెంట్ సీజ్ చేశారు. అతనిపై అయిదు కేసులు బుక్ చేశారు. అతనికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. మర్డర్‌తో పాటు ఫైర్ ఆర్మ్స్ అభియోగాలు నమోదు చేశారు.
గత బుధవారం మన్‌హట్టన్‌లోని హిల్టన్ హోటల్ బయట .. బ్రియాన్ థాంప్సన్‌ను కాల్చి చంపారు. ఇన్సూరెన్స్ సంస్థ అయిన యునైటెడ్ హెల్త్‌కేర్ ఆ రోజు ఇన్వెస్టర్లతో మీటింగ్ నిర్వహిస్తోంది. అయితే ప్రీప్లాన్డ్‌గా హత్య జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. షూటింగ్ ఘటన తర్వాత నిందితుడి కోసం న్యూయార్క్ సిటీలో భారీగా గాలింపు జరిగింది. ప్రపంచంలోని అత్యుత్తమ డిజిటల్ సర్వియలెన్స్ వ్యవస్థతో పాటు పోలీసు శునకాలను వాడారు. డ్రోన్లు కూడా వినియోగించారు.
లైసెన్సు లేని ఆయుధంగా కలిగి ఉన్న కేసులో మాంగియోన్‌ను పెన్సిల్వేనియా జైలులో బంధించారు. పోలీసులకు తప్పుడు ఐడెంటిఫికేషన్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడి బ్యాక్‌ప్యాక్ బ్యాగులో ఓ త్రీడీ ప్రింట్ పిస్తోల్, త్రీడీ ప్రింట్ సైలెన్సర్, లోడెడ్ మ్యాగ్జిన్, ఆరు రౌండ్ల 9ఎఎం అమ్యూనిషన్ ఉన్నాయి. అమెరికా పాస్‌పోర్టుతో పాటు పది వేల డాలర్లు ఉన్నాయి. దాంట్లో రెండు వేల డాలర్ల విదేశీ కరెన్సీ ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com