Earthquake : అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి

Earthquake : అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
X

అఫ్గానిస్థాన్‌ లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌ సరిహద్దులోని కునార్‌ ప్రావిన్స్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ ఘోర విపత్తు కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 250 వరకు ఉంటుందని భావిస్తున్నారు. 500 మంది వరకు గాయపడి ఉంటారని సమాచారం. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వివరాల ప్రకారం.. నంగర్హార్‌ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రి 11.47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. అఫ్గాన్‌ సమాచార ప్రసార మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం మృతుల సంఖ్య 250 వరకు ఉందని అనడోలు ఏజెన్సీ పేర్కొంది. మరో 500 మంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది. ఘోర విపత్తు కారణంగా కునార్‌ ప్రావిన్స్‌ తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. భూకంప తీవ్రతకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. బాధితులకు అత్యవసర సహాయం అవసరమని పలువురు పోస్టులు పెడుతున్నారు.

భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని వార్దక్‌ ప్రావిన్స్‌ మాజీ మేయర్‌ జరీఫా ఘఫ్పారీ పోస్టు పెట్టారు. ఈ విపత్తు ధాటికి పలు కుటుంబాలు కకావికలమైనట్లు పేర్కొన్నారు. ‘‘అఫ్గానిస్థాన్‌లోని కునార్‌, నోరిస్థాన్‌, నంగర్హార్‌ ప్రావిన్స్‌లు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇళ్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి జీవితం అగమ్యగోచరంగా మారింది. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాలపాలై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉంది. అసమర్థ తాలిబన్‌ ప్రభుత్వం ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా లేదు. ఈ సమయంలో కునార్‌ ప్రజలకు సాయం అత్యవసరం. అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలి. అవసరమైన ఆహారం అందించి.. ఆశ్రయం కల్పించాలి. ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి’’ అని పోస్టులో పేర్కొన్నారు.

Tags

Next Story