Minister Lokeshనేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులకు అండగా మంత్రి లోకేశ్..

నేపాల్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి ఐటీ, మానవ వనరుల అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణ చర్యలు చేపట్టారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కార్యాలయంలో ఆయన అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజల సమాచారాన్ని మంత్రికి అందించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు 240 మంది తెలుగు వారు నేపాల్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో 90 మంది గౌశాలలో, 55 మంది పశుపతి నగర్‌లో, 27 మంది బఫాల్‌లో, 12 మంది సిమిల్‌కోట్‌లో, మరికొందరు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు వెల్లడించారు. బాధితులతో మంత్రి లోకేశ్ వీడియో కాల్ ద్వారా మాట్లాడి, అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
బాధితులను కాఠ్‌మాండూ నుంచి విశాఖపట్నానికి ప్రత్యేక విమానం ద్వారా తరలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బాధితులకు తక్షణ సహాయం అందించడం, వారిని సురక్షితంగా తరలించే బాధ్యతలను సీనియర్ అధికారులైన అర్జా శ్రీకాంత్, కార్తికేయ మిశ్రా, ముకేశ్ కుమార్ మీనా, కోన శశిధర్, అజయ్ జైన్, హిమాన్షు శుక్లా, జయలక్ష్మిలకు అప్పగించారు. ప్రతి రెండు గంటలకు బాధితుల క్షేమ సమాచారం తెలుసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
వీలైనంత త్వరగా ఏపీ వాసులు రాష్ట్రానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని, దీనికోసం విదేశాంగ శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని మంత్రి ఆదేశించారు. అధికారులు ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించామని మంత్రికి వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com