Nellore Cow : కాసుల పంట పండించిన నెల్లూరు జాతి ఆవు

Nellore Cow : కాసుల పంట పండించిన నెల్లూరు జాతి ఆవు
X
బ్రెజిల్‌లో జరిగిన వేలంలో ఓ గోవు

ఆవు పంటలు పండించడం చూశాం కానీ, కాసుల పంట పండించడం ఎప్పుడైనా చూశారా? బ్రెజిల్‌లో జరిగిన వేలంలో ఓ గోవు అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ఏకంగా 4.8 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.40 కోట్లకు పైగా) ధర పలికి ఔరా అనిపించింది.

1101 కిలోల బరువు

శ్రేష్ఠమైన జాతి, నాణ్యత, మంచి లక్షణాలు కలిగిన ఆవులకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. సాధారణంగా ఇవి ఎక్కువ ధర పలుకుతాయి. జపాన్‌కు చెందిన వాగ్యు, మన దేశంలో బ్రాహ్మణ్‌ పేరు గల ఆవులకు గతంలో రికార్డు ధరలు దక్కాయి. తాజాగా బ్రెజిల్‌లోని మినాస్‌ గెరైస్‌లో జరిగిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా-19 అనే ఆవు 4.8 మిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోయి కాసుల పంట పండించింది. ఇది సుమారు 1,101 కిలోల బరువు ఉండటం విశేషం. సాధారణంగా ఇదే జాతికి చెందిన ఆవుల కంటే దీని బరువు రెట్టింపు కావడం గమనార్హం.

వియాటినా-19 అత్యధిక ధర పలికిన ఆవుగా గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకుంది. అంతేకాదు, గతంలో కండరాల నిర్మాణం, అత్యంత అరుదైన జన్యువులు కలిగి ఉన్నందుకు గానూ ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’లో ‘మిస్‌ సౌత్‌ అమెరికా’ పురస్కారమూ పొందింది. పశు సంపద పెంచేందుకు గానూ వియాటినా-19 ద్వారా భారీగా వ్యాపారం జరుగుతున్నట్టు సమాచారం. ఈ గోవు అండాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు.

ఏపీకి చెందిన జాతి

ఈ నెల్లూరు జాతి మన దేశానికి చెందినదే. వీటినే ఒంగోలు జాతి అని కూడా పిలుస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం ఉన్న వీటికి ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతా ల్లో భారీ డిమాండ్‌ ఉంది. 1800లలో ఈ జాతి బ్రెజిల్‌కు ఎగుమతి అయ్యాయి. కండరాల నిర్మాణం, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వీటిని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.

Tags

Next Story