Israel-Hamas War: గాజాలోని భారతీయుల తరలింపు ప్రస్తుతానికి కష్టమే

ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో సాధారణ ప్రజలు మరణిస్తున్నారు. హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై క్రూరమైన దాడులు చేశారు. ఈ దాడుల్లో 1400 మంది చనిపోయారు. మరోవైపు ప్రతీకారేచ్ఛతో రగులుతున్న ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై హమాస్ ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది. ఇప్పటికే మొత్తం 4000 మంది ప్రజలు చనిపోయారు. దీంతో గాజాలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఆసుపత్రి వద్ద సంభవించిన పేలుడు ఘటనలో వందలాది మంది మృతి చెందారు. గాజాలో పౌరుల మరణాలు, పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని అంతర్జాతీయ సమాజం ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది.
ఇజ్రాయిల్ లో చిక్కుకుపోయిన భారతీయులను ‘ఆపరేషన్ అజయ్’ ద్వారా కేంద్రం స్వదేశానికి చేర్చింది. అయిగే గాజాలోని భారతీయులను ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకురావడం కష్టమని, అవకాశం వస్తే వెంటనే వారిని స్వదేశానికి రప్పిస్తామని విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజాలో పరిస్థితి కష్టంగా ఉందని, కానీ అవకాశం దొరికితే, మేము వారిని బయటకు తీసుకువస్తానమని అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు. ప్రస్తుతం గాజాలో నలుగురు భారతీయులు ఉన్నారని చెప్పారు. కేరళకు చెందిన ఓ మహిళా కేర్‌టేకర్ మాత్రం గాయపడగా.. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపింది.
ఇజ్రాయిల్, గాజాపై జరిపిన దాడిలో ఇప్పటి వరకు భారతీయుడు మరణించినట్లు నివేదికలు లేవని తెలిపారు. గాజాలోని ఆస్పత్రిలో బాంబు పేలుడులో 500 మంది మరణించిన విషయం గురించి మాట్లాడుతూ.. పౌర మరణాలు, మానవతా పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు అరిందమ్ బాగ్చీ అన్నారు. ఇజ్రాయిల్ నుంచి ఆపరేషన్ అజయ్ కింద ఐదు విమానాల్లో 18 మంది నేపాలీ పౌరులతో పాటు 1200 మంది భారతీయులను స్వదేశానికి రప్పించారు. ఇక పాలస్తీనాకు భారతదేవం 2000 నుంచి 2023 వరకు దాదాపుగా 30 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించింది. స్థానిక పరిస్థితులను పరిశీలించి అవసరమైతే మరిన్ని విమానాలు ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ లో మాట్లాడారు. అల్ అహ్లీ ఆసుపత్రి ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com