Imran Khan : భారత్‌ను ఏ అగ్రరాజ్యం శాసించలేదు: ఇమ్రాన్‌ఖాన్‌

Imran Khan :  భారత్‌ను ఏ అగ్రరాజ్యం శాసించలేదు: ఇమ్రాన్‌ఖాన్‌
Imran Khan : భారత్‌ను ఏ అగ్రరాజ్యం శాసించలేదు. ప్రపంచంలోని ఏ శక్తీ ఇండియాను గుప్పిట్లో పెట్టుకోలేదు. భారత్‌ ఒక అత్యున్నత సౌర్వభౌమ దేశం.

Imran Khan : భారత్‌ను ఏ అగ్రరాజ్యం శాసించలేదు. ప్రపంచంలోని ఏ శక్తీ ఇండియాను గుప్పిట్లో పెట్టుకోలేదు. భారత్‌ ఒక అత్యున్నత సౌర్వభౌమ దేశం. ఈ మాటలు ఒక పాక్‌ ప్రధాని నోటి వెంట వస్తుంటే.. ఆ మాటలు భారతీయులుగా వింటుంటే ఆ కిక్కే వేరు. పాకిస్తాన్‌ ప్రధానమంత్రిగా కొనసాగేందుకు ఆఖరి బంతి వరకు ప్రయత్నిస్తానన్న ఇమ్రాన్‌ఖాన్‌.. బహిరంగ వేదికపై భారత్‌ గురించి నిజాలు మాట్లాడారు. భారత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. భారతదేశ విదేశాంగ విధానాన్ని ఏ అగ్రరాజ్యం శాసించలేదని వ్యాఖ్యానించారు ఇమ్రాన్‌ ఖాన్. పాకిస్తాన్‌లాంటి దేశంలో ప్రభుత్వాన్ని కూల్చేయడం, అలాంటి వ్యాఖ్యలు చేయడం ఇతర దేశాలకు సాధ్యమేనని.. కాని, భారత్‌ విషయంలో అలా మాట్లాడే సాహసం ఏ ఒక్క అగ్రరాజ్యానికీ లేదని దిక్కులు పెక్కుటిల్లేలా పొగిడారు. పాక్‌ గడ్డపై భారత్‌ను ఈ స్థాయిలో మెచ్చుకోవడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు.

పాక్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి.. అమెరికాలోని పాక్‌ రాయబారికి హెచ్చరిక సందేశాన్ని పంపించిన విషయాన్ని ఇమ్రాన్‌ఖాన్‌ గుర్తుచేశారు. ఇండియాపై ఇలాంటి దుస్సాహసం చేయగలిగిన దేశం ఈ ప్రపంచంలోనే లేదని మెచ్చుకున్నారు. సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు పాక్ ప్రజలంతా రేపు సాయంత్రం తనతో పాటు వీధుల్లోకి వచ్చి నిరసన తెలపాలని ఇమ్రాన్‌ఖాన్‌ పిలుపునిచ్చారు. తమ విధేయులుగా ఉండే వ్యక్తులే పాక్‌ ప్రభుత్వంలో ఉండాలని పలు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని పరోక్షంగా అమెరికాను విమర్శించారు.

అమెరికా దౌత్యవేత్తలు పాకిస్తాన్‌ ఎంపీలను కలిసినప్పటి నుంచే కథంతా మారిందని, చివరికి పాకిస్తాన్‌ మీడియా కూడా అగ్రరాజ్యంతోనే చేతులు కలిపిందని ఆరోపించారు. అసలు భారత్‌లా పాకిస్తాన్‌ ఎందుకు ఉండలేదు అంటూ మాట్లాడారు. ఇమ్రాన్‌ఖాన్‌ భారత్‌ను కీర్తిస్తూ చేసిన మాట్లాడడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. భారత్‌ అంత గొప్పదైతే పాక్‌ను వదిలి భారత్‌కు వెళ్లిపోవాలని విమర్శించాయి. అధికారం పోతోందనే ఇమ్రాన్‌ఖాన్‌ పిచ్చెక్కి మాట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించాయి. భారత్‌ అంటే అంత ఇష్టమైతే అక్కడికే వెళ్లండని మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్ కుమార్తె మరియమ్ నవాజ్‌.. ఇమ్రాన్‌పై మండిపడ్డారు.

ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. పాక్‌ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగబోతోంది. 342 స్థానాలున్న సభలో ప్రతిపక్షాల తీర్మానం నెగ్గాలంటే 172 ఓట్లు అవసరం. అయితే, 172 కంటే ఎక్కువ బలమే ఉందని ప్రతిపక్షాలు రుజువు చేసుకున్నాయి. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌కు పదవీగండం తప్పేలా లేదు. ఇదే జరిగితే.. పాక్‌ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ రికార్డులకెక్కుతారు. పాకిస్తాన్‌ కొత్త ప్రధానిగా పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

Tags

Next Story