Indian Army: పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులు

పహల్గాం ఉగ్రదాడి తో భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్‌పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులకు తావులేకుండా.. పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. దేశ వ్యాప్తంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సిందూర్‌పై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ‘భారత్ మాతా కీ జై’ పేరుతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
పహల్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణశాఖ ప్రకటించింది. భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. ‘న్యాయం జరిగింది’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను భారత్ సైన్యం ఇంకా వెల్లడించలేదు. మరోవైపు భారత్‌లోని శ్రీనగర్, జమ్ము, అమృత్‌సర్, ధర్మశాల, లే విమానాశ్రయాలను భారత్ మూసివేసినట్లు సమాచారం.
మెరుపు దాడులపై స్పందించిన పాక్ ప్రధాని
మరోవైపు భారత్ దాడులను పాక్ సైన్యం ధ్రువీకరించింది. పాక్ డీజీ ఐఎస్‌పీఆర్ లెప్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ స్పందించారు. పాక్‌లోని కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారని, 12 మందికి గాయాలైనట్టు పాక్ ఆర్మీ పేర్కొంది. సమయం చూసుకొని బదులుగా స్పందిస్తామని పేర్కొన్నారు. భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని అన్నారు.
ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ‘‘మోసపూరిత శత్రువు పాకిస్థాన్‌లోని 5 ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఈ చర్యలకు పాకిస్థాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్థాన్, ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ దాడులను ఆయన యుద్ధ చర్యలను అని పేర్కొన్నారు. పాక్ ప్రధాని ప్రకటన తర్వాత.. సరిహద్దులోని పూంఛ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. దీంతో భారత్ సైతం కాల్పులు మొదలుపెట్టింది. ఎల్‌వోసీ వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిడ్కే టెర్రరిస్టు గ్రూప్ లష్కరే తొయిబాకు హెడ్ క్వార్టర్స్‌గా ఉంది. ఇక పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్‌లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైష్ -ఎ- మహ్మద్ స్థావరం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com