PAK-AFG:పాక్-అఫ్గాన్‌ను కమ్మేసిన యుద్ధ మేఘాలు

దాయాది దేశాలైన పాకిస్థాన్ - అఫ్గానిస్థాన్ల సరిహద్దు ప్రాంతం మరోసారి రణరంగంగా మారింది. అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన వైమానిక దాడులకు ప్రతీకారంగా.. తమ దళాలు పాకిస్థాన్ సైనికులపై సాయుధ ఎదురుదాడికి దిగాయని అఫ్గానిస్థాన్ పాలకవర్గమైన తాలిబాన్ సంచలన ప్రకటన చేసింది. 'డ్యురాండ్ రేఖ' వెంబడి కునార్ నుంచి హెల్మండ్ వరకు వివిధ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఘర్షణలు కొనసాగుతున్నాయని.. దీనికి పాకిస్థాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే కారణమని తాలిబాన్ ఆరోపించింది. కునార్ నుండి హెల్మండ్ వరకు.. దశాబ్దాలుగా యుద్ధాల అంచున ఉన్న ఈ సరిహద్దు ప్రావిన్సుల్లో ఘర్షణలు తీవ్రంగా కొనసాగుతున్నాయని స్థానిక అధికారులు ధృవీకరించారు.
తాలిబన్ బలగాల కాల్పులు
పాక్ సరిహద్దుల వెంట తాలిబన్ బలగాలు కాల్పులు జరిపాయి. అనంతరం అఫ్గాన్ సరిహద్దులు లక్ష్యంగా పాక్ దాడులకు దిగింది. ఇటీవల కాబూల్‌పై జరిగిన వైమానిక దాడులకు స్పందనగా తాము ప్రతీకార దాడులకు పాల్పడినట్లు అఫ్గాన్ పేర్కొంది.అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ స్థావరం లక్ష్యంగా పాక్ ఫైటర్ జెట్లు దాడి చేసినట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారంగా ప్రస్తుతం తాలిబన్ దళాలు సరిహద్దుల వెంబడి దాడులు చేపట్టినట్లు అఫ్గాన్ అధికారులు వెల్లడించారు. పాక్ బలగాలు నిబంధనలను ఉల్లంఘిస్తే తమ సాయుధ దళాలు దాడులను మరింత ఉద్ధృతం చేస్తాయని హెచ్చరించారు. పాకిస్థాన్ బలగాలు చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తూర్పున ఉన్న తాలిబాన్ సరిహద్దు దళాలు వివిధ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పాకిస్థాన్ బలగాల పోస్టులపై తీవ్ర ఘర్షణలకు దిగాయని అఫ్గాన్ మిలటరీ ఒక ప్రకటనలో పేర్కొంది.
58 మంది పాక్ సైనికులు హతం
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణల వేళ తాము 58 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టామని అఫ్గానిస్థాన్ ప్రకటించింది. ఇస్లామాబాద్ పదేపదే తమ సరిహద్దుల ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. అదే విధంగా.. ఐసిస్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించొద్దని పాకిస్థాన్‌ను హెచ్చరించింది. అప్ఘానిస్థాన్‌పై దాడులు చేసినట్లు పాకిస్థాన్ ఇప్పటి వరకు ప్రకటించుకోలేదు. కానీ టీటీపీ మిలిటెంట్లకు ఆశ్రయం ఇవ్వడాన్ని కాబూల్ మానుకోవాలని పాకిస్థాన్ డిమాండ్ చేసింది. అఫ్గాన్ తాలిబాన్ భావజాలాన్ని కలిగి ఉన్న, అఫ్గానిస్థాన్‌లో యుద్ధ శిక్షణ పొందిన టీటీపీ మిలిటెంట్లు.. 2021 నుండి తమ వందలాది మంది సైనికులను చంపిందని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది.
పాక్ - అఫ్గాన్ సరిహద్దుల వెంట నాలుగు పాయింట్లలో మొదట చిన్న ఆయుధాలతో, ఆ తర్వాత భారీ ఫిరంగులతో కాల్పులు జరిపినట్లు పాకిస్థాన్‌లోని ఖైబర్-ఫఖ్తుంంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన అధికారి ధ్రువీకరించారు. పేలుడు పదార్థాలను కలిగి ఉన్న మూడు అఫ్గాన్ క్వాడ్కాప్టర్లను కూల్చివేసినట్లు తెలిపారు. ఇరువైపుల నుంచి పోరాటం తీవ్రంగా సాగుతున్నట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ పర్వత ప్రాంతాల్లోని పాకిస్థాన్ భద్రతా దళాలపై టీటీపీ మిలిటెంట్లు దాడులు తీవ్రం చేశారు. తమ భూభాగాన్ని ఉపయోగించుకొని పాకిస్థాన్‌పై దాడులు చేస్తున్నారని, ఆ మిలిటెంట్లను నియంత్రించడంలో అఫ్గాన్ విఫలమవుతోందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అయితే పాకిస్థాన్ ఆరోపణలను కాబూల్‌లోని అధికారులు ఖండించారు. ఇరు దేశాల ఉద్రిక్తతలతో పౌరులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com