పాక్ ప్రధాని ఎవరు.. ఎవరికి ఎన్ని సీట్లంటే..!

పాక్ ప్రధాని ఎవరు.. ఎవరికి ఎన్ని సీట్లంటే..!

దాయాది దేశం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు ముగిసినా ఫలితాలు రేపిన ఉత్కంఠ ఇంకా తగ్గలేదు. అనేక ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపణలు వినిపించాయి. పలువురు గెలిచిన అభ్యర్థులు సైతం గెలుపును పక్కన పెట్టి వైదొలుగుతుండటం ఇపుడు సరికొత్త ట్విస్ట్ లకు కారణమవుతోంది.

పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 265 సీట్లున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ 101 స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్-ఎన్ పార్టీకి 75 సీట్లు వచ్చాయి. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడైన బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 54 సీట్లలో గెలిచింది. ఈ మూడు పార్టీలో ఏ ఒక్క పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంపూర్ణ మెజార్టీ రాలేదు. నవాజ్ షరీఫ్ - బిలావల్ భుట్టోలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రెండు పార్టీలు కలిస్తే 129 సీట్లు అవుతాయి.

గెలుపొందిన ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నవాజ్ షరీఫ్ పార్టీలో చేరారు. మరో 17 సీట్లను గెలుచుకున్న ఎంక్యూఎం-పీతో నవాజ్ షరీఫ్ చర్చలు జరుపుతున్నారు. దీంతో నవాజ్ షరీఫ్ సారథ్యంలో పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతర ప్రధాన పార్టీలు ఏర్పాటుచేసే సంకీర్ణ ప్రభుత్వంలో తాము చేరే ప్రసక్తే లేదని ఇమ్రాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) ఇప్పటికే తేల్చిచెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story