Turkey : పాక్ మా ఫ్రెండ్.. సాయానికి సిద్ధమన్న టర్కీ

పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన టర్కీపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ టైంలో టర్కీ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ తమకు నిజమైన మిత్రదేశమని, భవిష్యత్తులోనూ ఆ దేశానికి అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
కాల్పుల విరమణకు సంబంధించి టర్కీకి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ధన్యవాదాలు తెలిపిన నేపథ్యంలో, ఎర్డోగాన్ ఆయనను అభినందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. "నా విలువైన మిత్రుడు షెహబాజ్ షరీఫ్.. టర్కీ-పాకిస్థాన్‌ల మధ్య సోదరభావం అనేది నిజమైన స్నేహానికి నిదర్శనం. ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే దీన్ని కొనసాగిస్తాయి" అని ఎర్డోగాన్ పేర్కొన్నారు. టర్కీలో శాంతి, స్థిరత్వాన్ని కోరుకున్నట్లే పాకిస్థాన్‌లో కూడా కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. వివాదాల పరిష్కారంలో చర్చలు, రాజీకి ప్రాధాన్యం ఇస్తున్న పాక్ ప్రభుత్వ విధానాన్ని తాము అభినందిస్తున్నట్లు చెప్పారు.
"గతంలో మంచి, చెడు సమయాల్లో అండగా నిలిచినట్లే.. భవిష్యత్తులోనూ పాక్‌కు అండగా ఉంటాం. పాకిస్థాన్-టర్కీ దోస్తీ జిందాబాద్!" అంటూ ఎర్డోగాన్ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా పాక్ ప్రధానిని 'విలువైన మిత్రుడు'గా ఆయన అభివర్ణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com