Pakistan Economy : అమెరికాతో భారీ డీల్.. పాక్ ఆర్థిక కష్టాలు తీరినట్టేనా ? ఇప్పుడు కుబేర దేశం అయిపోతుందా?

Pakistan Economy : అమెరికాతో భారీ డీల్.. పాక్ ఆర్థిక కష్టాలు తీరినట్టేనా ? ఇప్పుడు కుబేర దేశం అయిపోతుందా?
X

Pakistan Economy : తీవ్ర ఆర్థిక సంక్షోభం, అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అమెరికా నుంచి ఒక భారీ ఊరట లభించింది. తినడానికి తిండి లేక, చివరకు అప్పుల కోసం ప్రపంచ దేశాల చుట్టూ తిరుగుతున్న పాకిస్థాన్‌కు తన విదేశీ ఆస్తి రూపంలో ఒక నిధి దొరికినట్లయింది. అమెరికాలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న తన చారిత్రక హోటల్‌ను ఆదాయ వనరుగా మార్చుకునేందుకు పాక్ ప్రభుత్వం అగ్రరాజ్యంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ గనుక సక్సెస్ అయితే, మునిగిపోతున్న పాక్ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక సంజీవనిలా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

పాకిస్థాన్ ఆశలన్నీ ఇప్పుడు న్యూయార్క్‌లోని రూజ్‌వెల్ట్ హోటల్ పైనే ఉన్నాయి. గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ సమీపంలో ఉన్న ఈ వందేళ్ల నాటి చారిత్రక కట్టడం పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సొంతం. అయితే నిర్వహణ భారమై 2020 నుంచి ఈ హోటల్ మూతపడి ఉంది. తాజాగా ఈ హోటల్‌ను పునరుద్ధరించి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు అమెరికాకు చెందిన జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్‌తో పాక్ రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రైమ్ లొకేషన్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాని వాషింగ్టన్ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే అమెరికా పాక్‌లోని బలూచిస్థాన్‌లో ఉన్న రెకో డిక్ రాగి, బంగారు గనుల ప్రాజెక్టుకు కూడా ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు రావడం గమనార్హం. ఒకవైపు ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి 700 మిలియన్ డాలర్ల అప్పులు తెచ్చుకుంటున్న పాక్.. మరోవైపు ఇలాంటి ఆస్తుల ద్వారా గట్టెక్కాలని చూస్తోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిండుకున్న తరుణంలో, అమెరికాతో కుదిరిన ఈ హోటల్ డీల్ పాకిస్థాన్‌కు పెద్ద ఊపిరిగా మారింది.

అయితే, వాస్తవ పరిస్థితి చూస్తే పాకిస్థాన్ ఇంకా అప్పుల మీదనే బతుకుబండిని లాగిస్తోంది. కేవలం అప్పులు తీర్చడానికే మరిన్ని అప్పులు చేయాల్సిన దుస్థితి అక్కడ నెలకొంది. ఈ హోటల్ పునరుద్ధరణ పనులు ఎప్పుడు మొదలవుతాయి, ఆదాయం ఎప్పటి నుంచి వస్తుంది అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయినప్పటికీ, చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో న్యూయార్క్‌లోని ఆస్తి ద్వారా కోట్ల రూపాయలు వస్తాయని ఆశపడటం పాకిస్థాన్‌కు ఒక పెద్ద లక్ అనే చెప్పాలి.

Tags

Next Story