Modi Israel Visit : ఇజ్రాయెల్‌లో ప్రధాని మోదీ పర్యటన.. మన దేశానికి ఆ దేశంతో ఉన్న బిజినెస్ బంధం ఎంతంటే?

Modi Israel Visit : ఇజ్రాయెల్‌లో ప్రధాని మోదీ పర్యటన.. మన దేశానికి ఆ దేశంతో ఉన్న బిజినెస్ బంధం ఎంతంటే?
X

Modi Israel Visit : భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌లో ఉన్నారు. బుధవారం అక్కడకు చేరుకున్న ప్రధానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా అత్యంత దృఢంగా ఉన్నాయి. కేవలం దౌత్యపరంగానే కాకుండా, వ్యాపార రంగంలో కూడా ఇరు దేశాల మధ్య లావాదేవీలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో అసలు ఇజ్రాయెల్‌తో మన దేశానికి ఉన్న వ్యాపార బంధం ఎంత? మనం అక్కడకు ఏం పంపుతున్నాం? అక్కడి నుంచి మనకు ఏం వస్తున్నాయో ఓసారి చూద్దాం.

తాజా గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ 2025లో భారత్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన వాణిజ్యంలో మన దేశానికే పైచేయి లభించింది. ఆ నెలలో భారత్ దాదాపు 178 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఇజ్రాయెల్‌కు ఎగుమతి చేయగా, అక్కడి నుంచి కేవలం 121 మిలియన్ డాలర్ల విలువైన సరుకులను మాత్రమే దిగుమతి చేసుకున్నాం. అంటే భారత్ సుమారు 56.8 మిలియన్ డాలర్ల వాణిజ్య మిగులుతో లాభాల్లో ఉంది. అయితే 2024 సెప్టెంబర్‌తో పోలిస్తే ఎగుమతుల్లో 5.19 శాతం, దిగుమతుల్లో ఏకంగా 20 శాతం మేర తగ్గుదల కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్లే వస్తువుల్లో అత్యధికంగా విలువైన రాళ్లు (సెమీ ప్రిషియస్ స్టోన్స్) ఉన్నాయి. వీటి విలువ దాదాపు 48.7 మిలియన్ డాలర్లు. వీటితో పాటు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ పరికరాలు, ముత్యాలు, మోటార్ వాహనాల డీజిల్, వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, వ్యవసాయ ఉత్పత్తులను భారత్ పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌కు పంపుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ నుంచి భారత్ ప్రధానంగా ఎరువులు (16.7 మిలియన్ డాలర్లు), ఎలక్ట్రానిక్ విడిభాగాలను (9.65 మిలియన్ డాలర్లు) దిగుమతి చేసుకుంటోంది.

భారత్-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం) గనుక కార్యరూపం దాల్చితే, ఇరు దేశాల మధ్య వ్యాపార సామ్రాజ్యం మరింత విస్తరిస్తుంది. ఈ ఒప్పందం వల్ల భారతీయ ఉత్పత్తులకు ఇజ్రాయెల్ మార్కెట్లో సులభంగా ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల మన దేశంలోని పరిశ్రమలకు, ముఖ్యంగా రైతన్నలకు నేరుగా లబ్ధి చేకూరుతుంది. ప్రధాని మోదీ పర్యటనతో ఈ ఒప్పందంపై ముందడుగు పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags

Next Story