పార్టీకి అనుకూలంగా దీక్ష చేస్తే అది నా అనర్హతకు దారి తీస్తుందా? రఘురామ

పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా తానెప్పుడూ మాట్లాడలేదన్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. హిందూ మతంపై దాడులకు నిరసనగా ఒక రోజు నిరసన తెలియజేస్తే.. పార్టీలకతీతంగా ఎంతో మంది మద్దతిచ్చారన్నారు. పార్టీకి అనుకూలంగా దీక్ష చేపడితే అది నా అనర్హతకు దారితీస్తుందా? అని ప్రశ్నించారు. దేవాలయాలపై దాడులు జరగకూడదని అనడం మా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకమా అని నిలదీశారు. ముఖ్యమంత్రిని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా..? లేక ఆయనే ఇవన్నీ చేస్తున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని సపోర్ట్ చేసినందుకు నాపై అనర్హత వేటు వేస్తారా? అని ప్రశ్నించిన ఆయన.. అనర్హతకు గురి కావాల్సింది నేనా..? నా పార్టీనా..? ప్రజలే చెప్పాలన్నారు.
తెలుగు భాషపై ప్రభుత్వ తీరు రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమేనన్నారు రఘురామకృష్ణరాజు. మహనీయులను గుర్తుంచుకోకపోయినా ఫర్వాలేదు కానీ.. వారు చేసిన కృషిని తుడిచిపెట్టడం సరికాదన్నారు. తెలుగు అకాడమీని పలుచన చేయడం ద్వారా.. తెలుగు ప్రజలకు ఏం సందేశం ఇవ్వనున్నారని ప్రశ్నించారు. సంస్కృతాన్ని ప్రోత్సహించాలి కానీ.. తెలుగును చంపేసే ఉద్దేశంతో నిర్ణయాలు ఎందుకన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com