Saudi : సౌదీలో ఎడారులను కప్పేసిన మంచు

సౌదీ అరేబియా అనగానే మనకు ఎడారులు, వేడి వాతావరణం గుర్తుకొస్తుంది. కానీ, అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఎడారి దేశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. రోడ్లు, ఇళ్లు, వాహనాల పైకప్పులు మంచుతో పూర్తిగా కప్పబడిపోయాయి. రహదారులన్నీ తెల్లటి తివాచీ పరిచినట్లు కనువిందు చేస్తున్నాయి. ఈ ఊహించని మంచు వర్షాన్ని చూసి స్థానిక ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.
ఇటీవల సౌదీలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మంచు కురవడం అక్కడి వాతావరణంలో వస్తున్న మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. మరోవైపు దేశంలో రానున్న రోజుల్లో వాతావరణం మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని సౌదీ వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతాలలో హిమపాతం చోటు చేసుకుంది. దీంతో రోడ్లపై మంచు కప్పేసింది. అధికారులు రోడ్లపై మంచును తొలగించి వాహనాల రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేశారు. కొండ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే తక్కువగా పడిపోయాయి.
ప్రముఖ సౌదీ ఖగోళ శాస్త్రవేత్త మాట్లాడుతూ, ఇటువంటి హిమపాతం సంఘటనలు విస్తృత దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ, శీతాకాలంలో అసాధారణం కాదని అన్నారు. ప్రతి శీతాకాలంలో ఇక్కడ మంచు కురుస్తుందన్నారు. డిసెంబర్– ఫిబ్రవరి మధ్య హిమపాతం సాధారణంగా నమోదవుతుందని పేర్కొన్నారు. తబుక్‌లోని జబల్ అల్ లాజ్, అలకాన్, అల్ ధార్, అల్ జౌఫ్‌లోని సకాకా, డుమాత్ అల్ జండాల్, అరర్, హెయిల్‌లోని జబల్ అజా, జబల్ సల్మా, అసిర్‌లోని అభా ఎత్తైన ప్రాంతాలు హిమపాతం ఎక్కువగా ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

