Britain : జులై 4న బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికలు

Britain :  జులై 4న బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికలు
తొలిసారి ఓటర్లను ఎదుర్కొనున్న రిషి

బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల తేదీపై వస్తున్న ఊహాగానాలకు ప్రధానమంత్రి రిషి సునాక్‌ తెరదించారు. జులై 4న వాటిని నిర్వహించనున్నట్లు బుధవారం ప్రకటించారు. తదనుగుణంగా త్వరలోనే పార్లమెంటును రద్దు చేయనున్నట్లు తెలిపారు. లండన్‌లో జోరుగా వర్షం కురుస్తున్నవేళ.. తన అధికారిక నివాసమైన ‘10 డౌనింగ్‌ స్ట్రీట్‌’ మెట్లపై నిలబడి తడుస్తూనే ఆయన ప్రసంగించారు. బ్రిటన్‌ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా తన హయాంలో సాధించిన విజయాలను గుర్తుచేశారు. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ కంటే విపక్ష లేబర్‌ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అత్యధిక ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేస్తుండడం గమనార్హం.

ఇదిలా ఉంటే… 44 ఏళ్ల రిషి సునక్ ప్రధానమంత్రిగా ఓటర్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి.అంతర్గత ఓట్ల ద్వారా 2022 అక్టోబర్‌లో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా రిషి నియామకం అయ్యారు. 2016లో బ్రెగ్జిట్ రిఫరెండం తర్వాత ఇది జరగబోయే మూడో సాధారణ ఎన్నికలు ఇవి. మరోవైపు, 14 ఏళ్లు అధికారంలో ఉన్న తర్వాత ప్రతిపక్ష లేబర్ పార్టీ చేతిలో కన్జర్వేటివ్‌లు ఓడిపోతారని ప్రీ-పోల్ సర్వేలు తెలుపుతున్నాయి. బ్రిటన్‌ పార్లమెంట్‌ రద్దు కంటే ముందే తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని లేబర్ పార్టీ పేర్కొంది.

Tags

Next Story