Rishi sunak: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటంలో ఇజ్రాయెల్ వెంటే...
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పోరాడుతోందని ఈ పోరులో ఇజ్రాయెల్ వెంట బ్రిటన్ ఎల్లప్పుడూ ఉంటుందని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ స్పష్టం చేశారు. . తీవ్రవాద సంస్థ హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. ఇప్పుడూ.. ఎప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆ దేశానికి అండగా ఉంటామన్నారు. రిషి సునక్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఆయనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రిషి సునక్ మాట్లాడుతూ... హమాస్ లా కాకుండా ఇజ్రాయెల్ తమ పౌరులకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు తీసుకుంటోందన్నారు. యుద్ధ ప్రాంతం నుంచి బ్రిటిష్ పౌరులను తరలించినందుకు గాను నెతన్యాహుకి ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్ మాత్రమే కాదని, పాలస్తీనా పౌరులను కూడా హమాస్ బాధితులుగా తాము గుర్తిస్తున్నామన్నారు. మానవతా సాయం కోసం సరిహద్దులను తెరిచినందుకు ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు తాను వచ్చినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ మాటల్లో చెప్పలేని భయంకరమైన తీవ్రవాద చర్యలను ఎదుర్కొంటోందన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టెల్ అవీవ్ లో పర్యటించిన మరుసటి రోజు రుషి సునక్ ఇజ్రాయెల్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. హమాస్ వల్ల వందల సంఖ్యలో ఇజ్రాయెల్ ప్రజల్ని కోల్పోయిందని వారి ధీటుగా సమాధానం ఇచ్చేందుకు తమ వంతు సాయంగా ఆయుధాల్ని అందించి దాడులు తీవ్రతరం అయ్యేలా చూస్తామని సునక్ స్పష్టం చేశారు. అదే టైంలో గాజాలోని ఓ ఆసుపత్రిపై బాంబులతో దాడులు చేయడంపై సునక్ స్పందించారు.
ఆ ప్రాంత ప్రజలకు మానవతా సాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అక్కడ నివసిస్తున్న బ్రిటన్ పౌరుల్ని స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తామన్నారు. యుద్ధంతో రెండు దేశాల్లో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ వైపు 13 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇజ్రాయెల్ దాడులతో గాజాలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అక్కడ 3వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రాణ భయంతో 10 లక్షలకు పైగా ప్రజలు గాజాను వీడిచి వెళ్లిపోయారు. గాజా ఆసుపత్రిపై జరిగిన బాంబ్ దాడి ప్రమాదం అవతలి వైపు వ్యక్తుల వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. నిన్న ఆయన ఇజ్రాయెల్ లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం అయ్యారు. టెల్ అవీవ్ లో యుద్ధం వల్ల సంభవించిన ఆస్తి నష్టాన్ని చూశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com