Russia : ఉక్రెయిన్‌‌‌తో యుద్దం.. తోక ముడుస్తున్న రష్యా.. !

Russia : ఉక్రెయిన్‌‌‌తో యుద్దం..  తోక ముడుస్తున్న రష్యా.. !
Russia : 20వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టాం. ఈ స్టేట్‌మెంట్‌ వింటే ఉక్రెయిన్‌ కావాలనే ఇంత పెద్ద సంఖ్య చెబుతోందని అనుకుంటారు.

Russia : 20వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టాం. ఈ స్టేట్‌మెంట్‌ వింటే ఉక్రెయిన్‌ కావాలనే ఇంత పెద్ద సంఖ్య చెబుతోందని అనుకుంటారు. రష్యాలాంటి మదగజం దాడి చేస్తుంటే.. సహజంగానే ఉక్రెయిన్ సైన్యం ఎక్కువగా నష్టపోవాలి. కాని, ఉక్రెయిన్‌ చెబుతున్నది అక్షరాలా నిజం. రష్యాతో పోల్చితే చిట్టెలుకలే కావొచ్చు. కాని, వాళ్లే రష్యన్‌ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు.

ఉక్రెయిన్‌ ఆర్మీ రష్యాను తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. దెబ్బకు దెబ్బ తీస్తోంది. నగరాలను ఆక్రమించుకుంటున్నా సరే తిరిగి స్వాధీనం చేసుకోగలుగుతున్నాయి. ఇది చాలదా రష్యాకు విజయం అంత ఈజీ కాదని చెప్పడానికి. రష్యా విజయం మాట అటుంచితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పుతిన్ యుద్ధానికి స్వస్తి చెప్పి, బలగాలను వెనక్కి తీసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు ఉక్రెయిన్ సైనికులు. రష్యాకు జరుగుతున్న నష్టం అలాంటిది మరి.

ఉక్రెయిన్‌ ఆర్మీకి తమ దేశ పరిస్థితులు తెలుసు. శత్రువును దెబ్బకొట్టాలంటే ఎక్కడ మాటు వేయాలో తెలుసు. రష్యా ఎలాంటి ఆయుధాలు వాడుతోందో ఉక్రెయిన్‌ సైనికులకు బాగా తెలుసు. దూసుకొస్తున్న రష్యన్‌ ఆర్మీని ఏ ఆయుధాలతో కొట్టాలో ఇంకా బాగా తెలుసు. మాటు వేసి కొడుతుంటే.. జింక పిల్లల గుంపులా ఎక్కడోళ్లు అటే పారిపోతున్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వందల మందితో దూసుకొస్తూ, గంభీరంగా వస్తున్న ఈ యుద్ధ ట్యాంకులను చూస్తే ఎంతటి వారైనా భయపడతారు. కాని, వాటిని చెల్లాచెదురు చేస్తోంది ఉక్రెయిన్‌ సైన్యం. కాన్వాయ్‌గా వస్తున్న సైన్యంపై మాటున పొంచి ఉండి మెరుపు దాడి చేశారు ఉక్రెయిన్‌ సైనికులు. ఆ దాడి నుంచి తప్పించుకోడానికి పరుగులు తీస్తున్న రష్యన్‌ సైనికులను పిట్టల్లా కాల్చిపడేశారు. ఒక్కో యుద్ధ ట్యాంక్‌ను వెంటాడి మరీ ధ్వంసం చేశారు. ఈ దృశ్యాలన్నీ రికార్డ్‌ అయ్యాయి.

ఇంతకీ, ఉక్రెయిన్‌ ఎలాంటి ఆయుధాలు వాడుతోందో తెలుసా. చేత్తో పట్టుకుని తిరిగే చిన్నపాటి స్ట్రింజర్స్‌ను వాడుతోంది. చూడ్డానికి సింపుల్‌గా కనిపిస్తున్నా.. వీటికి ట్యాంకులను ధ్వంసం చేసే సామర్ధ్యం ఉంది. చేయాల్సిందల్లా గురి పెట్టి కొట్టడమే. ఎన్‌లా పేరుతో తయారుచేసిన ఈ స్ట్రింజర్స్‌తోనే రష్యాను దెబ్బకొడుతున్నారు. పొదలు, మట్టి గడ్డల చాటున మాటు వేస్తున్న ఉక్రెయిన్‌ సైనికులు.. అదును చూసి రష్యా యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పోరాడుతున్న బలగాలకు గగనతలం నుంచి రక్షణ తప్పనిసరి. కాని, అలాంటి రక్షణ కల్పించకుండానే యుద్ధక్షేత్రంలోకి దింపింది రష్యా. దాని ఫలితమే ఈ నష్టం. ఇలాగే కొనసాగితే ఉక్రెయిన్‌ సైన్యం మనోస్థైర్యం మరింత పెరుగుతుంది. రష్యా సైనికులు వేలకు వేల మంది కళ్ల ముందే చనిపోతుంటే.. పుతిన్‌ సేనలో వణుకు మొదలవుతుంది. ఈ పరిణామాలన్నీ ఉక్రెయిన్‌ విజయానికి కలిసిరాక తప్పదంటున్నారు నిపుణులు.

Tags

Read MoreRead Less
Next Story