Petrol Price Hike : భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ట్రంప్ కండీషన్లతో సామాన్యుడి జేబు ఖాళీ.

Petrol Price Hike : డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కడంతో ప్రపంచ దేశాల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా భారత్‌కు ఇది ఒక రకమైన తీపి-చేదు వార్తలాంటిదే. ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా భారత్ ముందు ఒక కఠినమైన షరతు పెట్టారు. "రష్యా దగ్గర చౌకగా చమురు కొనడం ఆపేయండి.. మా దగ్గరో లేదా వెనిజులా దగ్గరో కొనండి" అని హుకుం జారీ చేశారు. ఒకవేళ భారత్ మాట వినకపోతే, భారత ఉత్పత్తులపై ఏకంగా 25 శాతం టారిఫ్ వేస్తానని హెచ్చరించారు. ట్రంప్ పెట్టిన ఈ షరతు ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తోంది.
రష్యా చమురు ఎందుకు అంత ముఖ్యం?
భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా మనకు చమురుపై భారీగా డిస్కౌంట్లు ఇస్తోంది. ఒకప్పుడు బ్యారెల్‌కు 7-8 డాలర్లు ఉన్న డిస్కౌంట్, ఇప్పుడు ఏకంగా 11 డాలర్ల వరకు చేరింది. అంటే రష్యా నుంచి కొనడం వల్ల భారత్‌కు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. అందుకే మన దిగుమతుల్లో మూడో వంతు రష్యా నుంచే వస్తోంది. కానీ ఇప్పుడు ట్రంప్ ఒత్తిడితో రిలయన్స్ వంటి ప్రైవేట్ సంస్థలు రష్యా నుంచి ఆర్డర్లు నిలిపివేసి, వెనిజులా వైపు చూస్తున్నాయి. ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా దిగుమతులు తగ్గించడం మొదలుపెట్టాయి.
అమెరికా ఆయిల్.. అంత సులభం కాదు
రష్యా ఆయిల్ మానేసి అమెరికా ఆయిల్ కొనడం అనేది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద టెక్నికల్ సమస్య ఉంది. రష్యా నుంచి వచ్చే యూరల్ క్రూడ్ కొంచెం బరువుగా ఉంటుంది, అందులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. మన దేశంలోని రిఫైనరీలు కూడా ఈ రకమైన చమురును శుద్ధి చేయడానికి అనుగుణంగా డిజైన్ చేయబడ్డాయి. కానీ అమెరికా అమ్మే షెల్ ఆయిల్ చాలా తేలికగా ఉంటుంది. ఒకవేళ మనం అమెరికా ఆయిల్ వాడాలంటే, దానిని ఇతర గ్రేడ్లతో కలిపి ప్రాసెస్ చేయాలి. ఇది చాలా ఖరీదైన పని. అంటే వస్తువు రేటు ఎక్కువ, దానిని వాడుకునే ఖర్చు కూడా ఎక్కువే.
మీ జేబుపై ఎంత భారం పడుతుంది?
నిపుణుల విశ్లేషణ ప్రకారం.. రష్యా చమురును కాదని అమెరికా చమురు వైపు వెళ్తే, భారత రిఫైనరీలకు ప్రతి బ్యారెల్‌పై కనీసం 7 డాలర్ల అదనపు భారం పడుతుంది. రష్యా నుండి చమురు రావడం కంటే, అమెరికా నుంచి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది, దీనివల్ల షిప్పింగ్ ఛార్జీలు కూడా తడిసి మోపెడవుతాయి. రిఫైనరీల ఖర్చు పెరిగితే, ఆ భారాన్ని కంపెనీలు భరించవు. నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ద్వారా ప్రజల మీదకు నెట్టేస్తాయి. ఫలితంగా ప్రస్తుతం రూ.110 లోపు ఉన్న పెట్రోల్ ధరలు మళ్ళీ భారీగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ట్రంప్ పెట్టిన ఈ షరతు భారత ప్రభుత్వానికి పెద్ద తలనెప్పిగా మారింది. ఒకవైపు అమెరికాతో వ్యాపార సంబంధాలు కాపాడుకోవాలి, మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా చూసుకోవాలి. ఇప్పటికే రష్యా నుంచి దిగుమతులు తగ్గడం మొదలైంది. ఒకవేళ పెట్రోల్ ధరలు పెరిగితే, దాని ప్రభావం నిత్యావసర వస్తువుల మీద కూడా పడుతుంది. మరి మోదీ ప్రభుత్వం ట్రంప్ షరతులను ఎలా డీల్ చేస్తుందో వేచి చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
