Russia-Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా మరో క్షిపణి దాడి

ఉక్రెయిన్ పై మరోసారి క్షిపణి దాడి చేసింది రష్యా. తూర్పు ఉక్రెయిన్ నగరమైన క్రామాటోర్స్క్ లో రెండు రష్యా క్షిపణులు ఢీకొనడంతో ఒక చిన్నారితో సహా కనీసం నలుగురు మరణించారు, మరో 42 మంది గాయపడ్డారు.
మంగళవారం రాత్రి 7:30 సమయంలో రష్యా మొదటి క్షిపణి ఒక రెస్టారెంట్‌ను తాకింది, తీవ్రమైన ఆస్తి నష్టాన్ని కలిగించింది. తక్షణమే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించారు. ఆ తరువాత కాస్త సమయానికే రెండో క్షిపణి క్రామాటోర్స్క్ శివార్లలోని గ్రామాన్ని ఢీకొట్టింది. ఈ రెండు ఘటనల్లో ఒక చిన్నారితో సహా కనీసం నలుగురు మరణించారు, మరో 42 మంది గాయపడ్డారు. క్రమాటోర్స్క్‌లో దాడితో పాటు, మధ్య ఉక్రెయిన్‌లో పశ్చిమాన సుమారు 375 కిమీ దూరంలో ఉన్న క్రెమెన్‌చుక్ నగరంలో ఒక రష్యన్ క్షిపణి, కొన్ని భవనాల సమూహాన్ని తాకింది. అయితే అక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఎమర్జెన్సీ క్రూ సంఘటన జరిగిన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. పగిలిన అద్దాలతో భవనం తీవ్రంగా దెబ్బతింది. రెస్క్యూ సిబ్బంది క్రేన్‌లు, ఇతర పరికరాలను ఉపయోగించి ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించడానికి, సహాయం చేయడానికి కృషి చేశారు.విషయం తెలుసుకున్న ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ఈ దాడులను ఖండించారు. రష్యా చర్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ డొనేట్స్క్ ప్రావిన్స్‌లోని క్రామాటోర్స్క్ ఒక ముఖ్యమైన నగరంగా పరిగణించబడుతుంది. ఈ నగరం ఇప్పటికే ఎన్నో రష్యన్ దాడులను ఎదుర్కొంది, ఏప్రిల్ 2022లో రైల్వే స్టేషన్‌పై దాడితో సహా 63 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రెమెన్‌చుక్‌లోని ఒక షాపింగ్ మాల్‌పై ఇంతకుముందు సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఇలాంటి దాడి జరిగి, కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం కూడా తెలిసిందే. ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా ఈ నగరం లోని అపార్ట్‌మెంట్ లు, పౌర స్థలాలపై దాడులు జరిగాయి. రష్యా కావాలనే పౌర స్థలాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వచ్చిన వార్తలను రష్యా ఇప్పటికీ ఖండిస్తూనే ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com