China: పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలో కొత్తగా నిర్మాణాలు
భారత్, చైనా ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి దౌత్య పరమైన ప్రయత్నాలు కొనసాగిస్తుంటే, మరో పక్క పాంగాంగ్ త్సో సరస్సు ఉత్తర తీరానికి దగ్గర్లో చైనా భారీగా నిర్మాణాల్ని చేపట్టింది. ఇండియా టుడే సమీక్షించిన తాజా ఉపగ్రహ చిత్రాల్లో ఈ విషయం వెల్లడైంది.
సరిహద్దుల్లో చైనా వైఖరి నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించిన చందంగా మారింది. ఓవైపు, ఉద్రిక్తతలను తగ్గించుకోడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు సాగిస్తూనే.. మరో పక్క పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరానికి దగ్గర్లో భారీగా నిర్మాణాల్ని డ్రాగన్ చేపట్టింది. తాజాగా, ఈ విషయం ఉపగ్రహాలు తీసిన ఫోటోలు బయటపెట్టాయి. ఈ నిర్మాణాలు భారత్-చైనా దళాల మధ్య 2020లో ప్రతిష్టంభన కొనసాగిన ప్రదేశానికి తూర్పున దాదాపు 38 కిలోమీటర్ల దూరంలో భారత ప్రాదేశిక భూభాగానికి అవతలి వైపు ఉన్నాయి. లడఖ్‌లోని ఎత్తైన పాంగోంగ్ సరస్సుపై చైనా నిర్మించిన కొత్త వంతెనకు తూర్పున ఇది దాదాపు 15 కి.మీ దూరంలో ఉంది.
వాస్తవాధీన రేఖకు సమీపాన గతంలో నియంత్రణలో లేని ప్రాంతాలలో ఒత్తిడిని పెంచడానికి బీజింగ్ తాజా ప్రయత్నాన్ని ఇది సూచిస్తోందని సైనిక వర్గాలు వెల్లడించాయి. భారత్- చైనా పాలిత టిబెట్ మధ్య వివాదాస్పద సరిహద్దు పాంగాంగ్ సరస్సు. తక్షశిల ఇన్‌స్టిట్యూషన్ ప్రొఫెసర్ నిత్యానందం ప్రకారం.. 100కు పైగా భవనాల నిర్మాణం అక్కడ కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ ఆపరేషన్ల కోసం దీర్ఘ చతురస్రాకార స్ట్రిప్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఎత్తైన పర్వ శిఖరాల వెనుక జరుగుతున్న ఈ నిర్మాణాలు వ్యూహాత్మక ప్రయోజనాన్ని కలిగి ఉంటాయని నిత్యానందం పేర్కొన్నారు.
ఒకవేళ ఆ ప్రాంతాన్ని సైనిక అవసరాల కోసం ఉపయోగిస్తే.. అది చైనా దళాల ప్రతిస్పందన సమయాన్ని తగ్గిస్తుందని భారత సైన్యం అంచనా వేసింది. క్షిపణి దాడుల సంభావ్య ప్రభావాన్ని తగ్గించడానికి ఈ నిర్మాణాలు చేపట్టినట్టు భావిస్తున్నారు. ‘ఈ ప్రాంతంలో చైనా నిర్మాణ కార్యకలాపాల్లో పాలుపంచుకున్న సైనికులు, పోర్టర్‌లకు వసతి, వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న స్థానాలకు తక్షణమే చేరుకోడానికి లాజిస్టిక్ నిల్వకోసం వీటిని చేపట్టింది.. 'ఒక్కో నిర్మాణంలో 6-8 మంది సైనికులు లేదా 10 టన్నుల వరకు లాజిస్టిక్‌లు ఉంటాయి అని సైనిక నిపుణులు అంటున్నారు. ఇందులో ఆర్టిలరీ షెల్స్ సహా పేలుడు పదార్థాలు ఉండొచ్చు’ అని సైనిక వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ప్రాంతంలో క్రేన్లు, నిల్వ కేంద్రాలు సహా భారీ యంత్రాలు ఉన్నట్టు ఉపగ్రహ ఫోటోలను విశ్లేషించి నిర్దారణకు వచ్చారు. నిర్మాణాలు చేపట్టి ప్రాంతాన్ని చైనా రెండు విధాలుగా ఉపయోగించుకోనుందని పాకిస్థాన్‌పై భారత్ సైన్యం సర్టికల్ డాడుల్లో పాల్గొన్న నార్తర్న్ ఆర్మీ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా అన్నారు. ‘కేవలం పౌరులకు మౌలిక సౌకర్యాలను మెరుగుపరుస్తామని చైనా చెబుతున్నా కానీ ఇది స్పష్టంగా ద్వంద్వ-వినియోగ మౌలిక సదుపాయాలు. దీనిని సైన్యం సంఘర్షణ సమయంలో ఉపయోగించుకుంటుంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మాణం చేపట్టిన ఈ ప్రదేశం క్షేత్రస్థాయిలోనూ వాస్తవ పరిస్థితులను మార్చగలదని అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com