Sheikh Hasina:తొలిసారి నోరువిప్పిన షేక్ హసీనా... యూనస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో రహస్య ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్న ఆమె ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్ నిరంకుశ పాలన దిశగా జారుకుంటోందని, ఉగ్రవాద సంస్థలతో కలిసి తీవ్రవాదం వైపు మళ్లుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
గతేడాది ఆగస్టు 5న తనను హింసాత్మకంగా అధికారం నుంచి తొలగించారని, విద్యార్థుల నిరసనలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు కుట్ర పన్నాయని హసీనా ఆరోపించారు. తన తండ్రి, జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ చారిత్రక నివాసాన్ని ధ్వంసం చేయడం ద్వారా విమోచన యుద్ధ స్ఫూర్తిని చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలు కేవలం నామమాత్రమేనని, అది రాజ్యాంగ విరుద్ధమైన పాలనను చట్టబద్ధం చేసే ఒక బూటకమని ఆమె అభివర్ణించారు. తన అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు.
యూనస్ అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో హిందువులు, ఇతర మైనారిటీలపై వ్యవస్థీకృతంగా దాడులు జరుగుతున్నాయని హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం వారికి రక్షణ కల్పించడంలో విఫలమవడమే కాకుండా, ఈ దాడులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. తన 15 ఏళ్ల పాలనలో మతసామరస్యాన్ని కాపాడానని గుర్తుచేశారు. ప్రస్తుత కష్టకాలంలో తనకు తాత్కాలిక ఆశ్రయం కల్పించినందుకు భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్ భవిష్యత్తును ఆ దేశ ప్రజలే నిర్ణయించుకోవాలని, ఈ విషయాన్ని భారత్ అర్థం చేసుకుంటుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

