Narendra Modi : ఇటలీ ప్రధాని ఆత్మకథ.. ముందు మాట రాసిన మోదీ..

Narendra Modi : ఇటలీ ప్రధాని ఆత్మకథ.. ముందు మాట రాసిన మోదీ..
X

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆత్మకథ భారత్‌లో విడుదల కానుంది. మెలోని, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య ఉన్న బలమైన స్నేహం నేపథ్యంలో ఈ పుస్తకానికి ఏకంగా నరేంద్ర మోదీ గారే ముందుమాట రాయడం విశేషం. మెలోని ఆత్మకథ అయాం మెలోని.. మై రూట్స్, మై ప్రిన్సిపల్స్ 2021లో తొలిసారిగా మార్కెట్లోకి వచ్చి బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఇటీవల అమెరికాలో విడుదలైన ఈ పుస్తకాన్ని, తాజాగా ఇండియన్ వెర్షన్ రూపొందించి భారత్‌లో విడుదల చేయడానికి మెలోని ఏర్పాట్లు చేస్తున్నారు.

మోదీ కలం నుంచి 'హర్ మన్ కీ బాత్' మెలోని ఆత్మకథకు ముందుమాట రాసే అవకాశం లభించడం తనకెంతో గౌరవమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మెలోని పుస్తకాన్ని ఆయన హర్ మన్ కీ బాత్ గా అభివర్ణించారు.

మోదీ తన ట్వీట్‌లో.. "ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని జీవితం, నాయకత్వం కాలంతో సంబంధంలేని సత్యాలను మనకు గుర్తుచేస్తాయి. ఈ ఉత్తేజకర జీవిత చరిత్రకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తుంది’’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా సాంస్కృతిక వారసత్వం, సమానత్వంపై మెలోనికి ఉన్న అపారమైన విశ్వాసాన్ని ఆయన కొనియాడారు.

పుస్తకంలో మెలోని ప్రయాణం

తన ఆత్మకథలో జార్జియా మెలోని తాను ఎదుర్కొన్న అనేక సవాళ్లను ప్రస్తావించారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో గర్భిణిగా, అవివాహితురాలైన తల్లిగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, సంఘర్షణలను గురించి ఆమె వివరించారు. ఈ అనుభవాలు ఆమె నాయకత్వ ప్రయాణానికి అద్దం పడతాయి. ప్రధాని మోదీ, మెలోని మంచి స్నేహితులన్న విషయం అంతర్జాతీయ వేదికలపై వారు పంచుకునే ఆత్మీయ పలకరింపుల ద్వారా స్పష్టమవుతుంది. దుబాయ్‌లో జరిగిన కాప్‌ 28* సదస్సు వేదికపై వీరిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫొటోను ఎక్స్‌లో షేర్ చేస్తూ వారి పేర్లు కలిసేలా మెలోడి అంటూ హ్యాష్ ట్యాగ్ జతచేశారు. అప్పటి నుంచి ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. మోదీ ముందుమాట రాయడంతో 'మెలోడి' స్నేహం మరోసారి బలపడింది.

Tags

Next Story