Syria : సిరియాలో ముగిసిన నియంత కుటుంబ పాలన

సిరియాలో ఆ దేశాధ్యక్షుడు బషర్ అల్-అసద్ కుటుంబ పాలన ముగిసింది. దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా సాగుతున్న అసద్ ఫ్యామిలీ రూలింగ్ కు తెరపడింది. తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌లోకి ఎంట్రీ అవ్వటంతో... అసద్ ఆదివారం తెల్లవారుజామున దేశం విడిచి వెళ్లిపోయారు. దాంతో ఆయన ప్రభుత్వం కూలిపోయి.. సిరియా పూర్తిగా తిరుగుబాటుదారుల నియంత్రణలోకి వెళ్లింది. డమాస్కస్ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. నిరంకుశ పాలన నుంచి తమకు విముక్తి కలిగిందంటూ పెద్ద సంఖ్యలో తిరుగుబాటు దారులు నినాదాలు చేశారు. మరోవైపు- అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు శరణార్థిగా చేరుకున్నారు. ప్రస్తుతం మాస్కోలో ఉన్నారు. ఆయనకు ఇన్నేళ్లూ అండగా ఉన్న రష్యా, ఇరాన్ తాజా పరిణామాలపై స్పందించాయి.
అధికార బదిలీపై తిరుగుబాటుదారులతో చర్చలు జరిపాకే అసద్ సిరియా వీడారని మాస్కో తెలిపింది. ఇక విదేశీ జోక్యం లేకుండా సిరియన్లే తమ దేశ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఇరాన్ సూచించింది. అమెరికా అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ .... రష్యా, ఇరాన్ బాగా బలహీనపడ్డాయని పేర్కొన్నారు. అసద్‌ను ఆదుకునే పరిస్థితుల్లో మాస్కో లేదని ఎద్దేవా చేశారు. అసద్ తండ్రి హఫిజ్ 1970లో సిరియాలో ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి అధికారంలోకి వచ్చారు. ఆయన మరణానంతరం దేశ పాలనా పగ్గాలను బషర్ అసద్ అందుకున్నారు. సిరియా 13 ఏళ్లుగా అంతర్యుద్ధంతో సతమతమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com