సముద్రంలో.. సబ్‌మెరైన్ కోసం గాలింపు

సముద్రంలో.. సబ్‌మెరైన్ కోసం గాలింపు
X
అట్లాంటిక్‌ మహా సముద్రంలో టూరిస్ట్ సబ్‌మెరైన్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అట్లాంటిక్‌ మహా సముద్రంలో టూరిస్ట్ సబ్‌మెరైన్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో న్యూఫౌండ్‌ల్యాండ్‌ నుంచి బయల్దేరిన మినీ జలాంతర్గామి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ప్రమాద ప్రాంత పరిసరాలను కెనడా, అమెరికా తీర రక్షక దళాలు జల్లెడ పడుతున్నాయి. భారీ ఎత్తున గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. నేటితో ఈ జలాంతర్గామిలోని ఆక్సిజన్‌ నిల్వలు పూర్తిగా అడుగంటిపోతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏదో అద్భుతం జరిగితే తప్ప ఇందులోని ప్రయాణికులు బతికి బయటపడటం కష్టమేనంటున్నారు నిపుణులు. పాకిస్థాన్‌ బిలియనీర్‌ షెహజాదా దావూద్‌, ఆయన కుమారుడు సులేమాన్‌, యూఏఈలో ఉంటున్న బ్రిటిష్‌ వ్యాపారవేత్త హమీష్‌ హార్డింగ్‌, ఈ యాత్ర నిర్వాహకుడు, ఓషన్‌గేట్‌ వ్యవస్థాపకుడు స్టాక్టన్‌ రష్‌, ఫ్రెంచ్‌ మాజీ నావికా అధికారి పాల్‌ హెన్రీ ఈ జలాంతర్గామిలో ఉన్నారు.

మరోవైపు ప్రమాద ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్న కెనడాకు చెందిన పీ-8 నిఘా విమానం నీటి అడుగు నుంచి వస్తున్న శబ్దాలను గుర్తించింది. 30 నిమిషాల కోసారి ఇవి వెలువడుతున్నాయని, ఇవి జలాంతర్గామి నుంచే వస్తున్నాయని భావిస్తుంది. ఈ సమాచారాన్ని అమెరికా నావికాదళంతోనూ పంచుకుంది. ఈ డేటా ఆధారంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని నౌకలను, నీటి అడుగున గాలింపు చర్యలు చేపట్టే సాధనాలను రంగంలో దించుతున్నారు.

Tags

Next Story