US India Drone Deal: అత్యాధునిక సాయుధ డ్రోన్ల విక్రయానికి అమెరికా అంగీకారం

భారత్‌కు విక్రయించనున్న 31 సాయుధ డ్రోన్లలో అత్యాధునిక సముద్ర రక్షణ, నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయని అమెరికా ప్రకటించింది. 31 MQ-9B సాయుధడ్రోన్లను 4బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు...గతేడాది ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అమెరికా పర్యటన సందర్భంగా ఒప్పందం జరిగింది. ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నుపై హత్యాయత్నం ఘటన ప్రభావం సాయుధ డ్రోన్ల విక్రయంపై పడిందని ప్రచారం జరుగుతున్న వేళ అమెరికా సానుకూల ప్రకటన చేసింది.
భారత్‌కు 31 అత్యాధునిక సాయుధ డ్రోన్లు విక్రయించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన అమెరికా వాటిలో అత్యాధునిక సముద్ర రక్షణ, నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయని తెలిపింది. భారత్‌కు పూర్తి యాజమాన్య హక్కులు కూడా లభిస్తాయని తెలిపింది. ప్రతిపాదిత విక్రయ ఒప్పందం...భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి సాయపడటంతోపాటు అమెరికా జాతీయ భద్రతా లక్ష్యాలు, విదేశీ విధానానికి మద్దతు ఇవ్వనున్నట్లు...అమెరికా రక్షణ, భద్రతా సహకార సంస్థ తెలిపింది. గతేడాది జూన్‌లో ప్రధాని నరేంద్రమోదీ జరిపిన చారిత్రక అమెరికా పర్యటన సందర్భంగా ఈ మెగా ఒప్పందం జరిగింది. గతవారం 31 MQ-9B సాయుధ డ్రోన్లను 3.99బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. అందులో 15 డ్రోన్లు నౌకా దళానికి, 8చొప్పున సైన్యం, వాయుసేనకు అందనున్నాయి.
MQ-9B సాయుధ డ్రోన్లతో సముద్రంపై మానవ రహిత నిఘా, సముద్ర జలాల్లో పెట్రోలింగ్ పెరిగి...ప్రస్తుత, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం పెరగనుంది. అలాగే సముద్ర భద్రత, సముద్ర జలాలపై అవగాహన సామర్థ్యం పెరుగుతుందని అమెరికా ప్రతినిధి వేదాంత్ పటేల్ (US representative Vedant Patel) తెలిపారు. సాయుధడ్రోన్లపై భారత్‌కు యాజమాన్య హక్కులు దక్కుతాయని చెప్పారు. ఈ విక్రయంతో భారత్‌తో తమ సంబంధాలు మరింత ధృడం కానున్నాయని అమెరికా ప్రతినిధి వేదాంత్ పటేల్ ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com