Mali-India: మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్..

పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో ముగ్గురు భారతీయ పౌరులు కిడ్నాప్‌కు గురయ్యారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాద దాడులతో అట్టుడుకుతున్న మాలిలో ఈ అపహరణ జరగడం కలకలం రేపుతోంది. కిడ్నాప్ అయిన భారతీయులను వీలైనంత త్వరగా, సురక్షితంగా విడిపించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని మాలి ప్రభుత్వాన్ని భారత్ కోరింది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించిన వివరాల ప్రకారం, మాలిలోని కేయెస్ ప్రాంతంలో ఉన్న డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు భారతీయులను సాయుధ దుండగులు అపహరించారు. ఈ నెల 1న ఈ ఘటన చోటుచేసుకుంది. సాయుధులైన కొందరు దుండగులు ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి చొరబడి, ప్రణాళిక ప్రకారం దాడి చేసి, ముగ్గురు భారతీయులను బలవంతంగా బందీలుగా పట్టుకుని తీసుకెళ్లారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ కిడ్నాప్ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. బమాకోలోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే రంగంలోకి దిగింది. స్థానిక ప్రభుత్వ అధికారులు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కిడ్నాప్ అయిన భారతీయుల కుటుంబ సభ్యులతో కూడా ఎంబసీ అధికారులు టచ్‌లో ఉన్నారని తెలిపింది. విదేశాంగ శాఖలోని సీనియర్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నారని, భారతీయుల త్వరితగతిన విడుదలకు అన్ని స్థాయిలలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
మాలిలో మంగళవారం జరిగిన పలు ఉగ్ర దాడులకు అల్-ఖైదా అనుబంధ సంస్థ అయిన 'జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వల్-ముస్లిమిన్' (JNIM) బాధ్యత వహించినప్పటికీ, ఈ కిడ్నాప్ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఏ సంస్థ కూడా స్పందించలేదు.
ఈ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం మాలిలో నివసిస్తున్న భారతీయ పౌరులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా సహాయం కావాలంటే బమాకోలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని కోరింది. కిడ్నాప్ అయిన భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి సాధ్యమైనంత అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com