Pakistan : పాక్ లో రైలు హైజాక్.. ఉగ్రవాదుల దుశ్చర్య

Pakistan : పాక్ లో రైలు హైజాక్.. ఉగ్రవాదుల దుశ్చర్య
X

పాకిస్తాన్లో ఓ రైలు హైజాక్ అయింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని వేర్పాటువాద ఉగ్రవాదులు ఈ దుశ్చర్య కు పాల్పడ్డారు. నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా నుంచి నుంచి ఖైబర్ పంఖుఖ్వాలోని పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలుపై కాల్పులు జరిపిన మిలిటెంట్లు రైలును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందుకు తమదే బాధ్యతని వేర్పాటువాద మిలిటెంట్ గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎస్ఏ) ప్రకటించింది. కాగా, రైలులో 400 నుంచి 450 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. ప్రయాణికు లలో పాక్ సైనిక సిబ్బంది కూడా ఉన్నారు. వీరిలో మహిళలు, పిల్లలు, సాధారణ ప్రయాణికుల్ని విడిచిపెట్టిన మిలిటెంట్లు దాదాపు 182 మందిని నిర్బంధించారు. వీరంతా సెలవులపై పంజాబ్ కు ప్రయాణిస్తున్న సమయంలో వారిని బందీలుగా చేసుకుంటున్నట్లు నివేదిక తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. మంగళవారం రాత్రి సమయానికి 20 మంది సైనికుల్ని హతమార్చారు. తమ డిమాండ్లను 48 గంటల్లో నెరవేర్చాలంటూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. తమపై సైనిక చర్యకు దిగినా, తమను ట్రాక్ చేయాలని చూసినా బందీలందర్నీ చంపేస్తామని వేర్పాటు వాదులు హెచ్చరించారు. ఈ సంఘటనను బలూచిస్తాన్ లోని ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ ధ్రువీకరించారు. హైజాక్ గురించి తెలియగానే అత్యవసర చర్యలు తీసుకోవాలని స్థానిక యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది.

Tags

Next Story