Gold Card : ట్రంప్ కొత్త గోల్డ్ కార్డ్ వీసా ప్రారంభం.. గ్రీన్ కార్డ్ కంటే ఇది ఎలా భిన్నం?

Gold Card : ట్రంప్ కొత్త గోల్డ్ కార్డ్ వీసా ప్రారంభం.. గ్రీన్ కార్డ్ కంటే ఇది ఎలా భిన్నం?
X

Gold Card : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో వ్యాపార ప్రముఖుల సమక్షంలో కొత్త వీసా ప్రోగ్రాం ట్రంప్ గోల్డ్ కార్డ్ ను ప్రారంభించారు. ఈ కొత్త కార్యక్రమం అమెరికాకు పెట్టుబడిదారులను, ప్రపంచంలోని టాలెంటెడ్ పర్సన్లను ఆకర్షించే ఉద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన ఇమ్మిగ్రేషన్ చొరవగా పరిగణిస్తున్నారు. ట్రంప్ ఈ గోల్డ్ కార్డును గ్రీన్ కార్డు కంటే చాలా మెరుగైనదిగా అభివర్ణించారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున డబ్బు, నైపుణ్యాన్ని తీసుకొస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ట్రంప్ అభిప్రాయం ప్రకారం.. ఈ కొత్త గోల్డ్ కార్డ్ కార్యక్రమం ప్రత్యేకంగా అమెరికాకు తమ పెట్టుబడి, వ్యాపారం, టాలెంటును తీసుకురావాలనుకునే విదేశీ ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తల కోసం రూపొందించారు. దీని వల్ల అమెరికన్ పరిశ్రమకు కొత్త అవకాశాలు లభిస్తాయని, కంపెనీలకు అర్హులైన ఉద్యోగులు దొరుకుతారని, తద్వారా దేశ ఆర్థిక వృద్ధిలో పెద్ద ఎత్తున పురోగతి వస్తుందని ఆయన అన్నారు.

ట్రంప్ ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు.. విదేశీ నిపుణుల కొరత గురించి ఫిర్యాదులు ఉన్న రంగాలకు ఈ ప్రోగ్రాం ఒక వరంలా మారుతుంది. "ప్రపంచంలోని చాలా మంది టాలెంటెడ్ యువత చదువు పూర్తి కాగానే భారత్, చైనా లేదా ఫ్రాన్స్ వంటి తమ దేశాలకు తిరిగి వెళ్లవలసి వచ్చేది.. కానీ ఇప్పుడు కంపెనీలు వారిని అమెరికాలోనే ఉంచుకోగలుగుతాయి" అని ఆయన పేర్కొన్నారు.

అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్ లైవ్ అయ్యిందని, దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైందని ప్రకటించారు. విదేశీ పౌరులు ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించడం ద్వారా ఈ ప్రత్యేక వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గోల్డ్ కార్డు కావాలంటే అమెరికన్ ఖజానాకు $1 మిలియన్ (సుమారు రూ.10 లక్షల డాలర్లు మన కరెన్సీలో రూ.9కోట్లు) సహకారం అందించడం.

ఈ డబ్బు నేరుగా అమెరికా ప్రభుత్వానికి చేరుతుంది. దరఖాస్తుదారుకు బదులుగా శాశ్వత నివాసం అంటే అమెరికాలో నివసించడానికి, పని చేయడానికి అనుమతి లభిస్తుంది. ట్రంప్ ఈ గోల్డ్ కార్డ్, గ్రీన్ కార్డు కంటే వేగవంతమైన ప్రక్రియను అందిస్తుందని, వ్యాపారాలకు కొన్ని అదనపు సౌకర్యాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. కంపెనీలు నేరుగా అర్హత కలిగిన ఉద్యోగి కోసం కార్డును ఏర్పాటు చేయవచ్చు, తద్వారా వారికి సుదీర్ఘమైన వీసా నిరీక్షణ అవసరం ఉండదు.

ఈ ప్రకటనతో ఆపిల్ వంటి టెక్ కంపెనీలు చాలా సంతోషిస్తాయని ట్రంప్ నవ్వుతూ చెప్పారు. టెక్ కంపెనీలకు ఇది పెద్ద ఉపశమనం అవుతుందని ఆయన తెలిపారు. ట్రంప్ ప్రకారం, ఇది కేవలం వీసా కార్యక్రమం మాత్రమే కాదు, అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద రాబడి వనరు కూడా. గోల్డ్ కార్డ్ కారణంగా భవిష్యత్తులో బిలియన్ల డాలర్లు అమెరికన్ ఖజానాలో జమ అవుతాయని, ఇది దేశానికి కొత్త ఆర్థిక బలాన్ని ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Next Story