Donald Trump : ట్రంప్ తలుచుకుంటే అంతే..వైన్ తాగాలంటే ఆస్తి అమ్ముకోవాల్సిందే!

Donald Trump : ట్రంప్ తలుచుకుంటే అంతే..వైన్ తాగాలంటే ఆస్తి అమ్ముకోవాల్సిందే!
X

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ వివాదాలను, ముఖ్యంగా గాజా యుద్ధాన్ని ముగించేందుకు తాను ఏర్పాటు చేసిన పీస్ బోర్డులో చేరడానికి నిరాకరించినందుకు ఫ్రాన్స్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ నుంచి దిగుమతి అయ్యే వైన్, షాంపైన్‌లపై ఏకంగా 200 శాతం టారిఫ్ (పన్ను) విధిస్తానని హెచ్చరించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈ బోర్డులో చేరనని చెప్పడంపై స్పందిస్తూ, "ఆయన ఉంటే ఎంత.. లేకపోతే ఎంత.. త్వరలోనే ఆయన పదవి నుంచి దిగిపోతారు" అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు.

ఈ పీస్ బోర్డులో సభ్యులుగా చేరాలని ట్రంప్ సుమారు 60 దేశాలకు ఆహ్వానాలు పంపారు. అయితే, ఇందులో చేరాలంటే ఒక్కో దేశం మూడు ఏళ్ల పాటు సభ్యత్వం కోసం 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,300 కోట్లు) నగదు రూపంలో చెల్లించాలని నిబంధన విధించారు. ఐక్యరాజ్యసమితి ఉనికిని దెబ్బతీసేలా ఈ బోర్డు ఉందని దౌత్యవేత్తలు భావిస్తుండగా, ఫ్రాన్స్ మాత్రం స్పష్టంగా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దీనికి తోడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కూడా ఈ బోర్డులోకి ఆహ్వానించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఒకవేళ ట్రంప్ గనుక 200 శాతం పన్ను విధిస్తే అమెరికాలో ఫ్రెంచ్ వైన్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతాయి. ఉదాహరణకు, ప్రస్తుతం అమెరికాలో 20 నుంచి 40 డాలర్లు పలుకుతున్న ఒక వైన్ బాటిల్ ధర, పన్నుల తర్వాత 60 నుంచి 120 డాలర్లకు (సుమారు రూ.10,000) చేరుతుంది. అంటే ధరలు మూడు రెట్లు పెరుగుతాయి. మద్యం ప్రియులకు ఇది కోలుకోలేని దెబ్బ. గత 11 నెలల్లో ట్రంప్ ఇలాంటి హెచ్చరిక చేయడం ఇది రెండోసారి. యూరోపియన్ యూనియన్ అమెరికా విస్కీలపై పన్నులు వేస్తే, తాము వైన్‌లపై అంతకు మించి పన్నులు వేస్తామని గతంలోనే ఆయన హెచ్చరించారు.

ట్రంప్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. ఐరోపా సమాఖ్య అమెరికాను దోచుకోవడానికి ఏర్పడిన శత్రుపూరిత సంస్థ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా స్టీల్, అల్యూమినియం దిగుమతులపై పన్నులు విధించినందుకు ప్రతిగా యూరోపియన్ యూనియన్ కూడా అమెరికా ఉత్పత్తులపై భారీ పన్నులు వేసింది. ఈ వాణిజ్య యుద్ధం ఇప్పుడు మద్యం వరకు చేరింది. ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ పన్నుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ట్రంప్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే ప్రపంచ వాణిజ్య సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

Tags

Next Story