Tariffs : ఏప్రిల్ నుంచి భారత్‌పై ప్రతీకార సుంకాలు: ట్రంప్

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. పెంచిన సుంకాలు మార్చి 4 (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక భారత్ పై విధించిన ప్రతీకార సుంకాలు వచ్చే నెల నుంచి అమలు కానున్నాయి.
భారత్, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేయనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్‌లో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పదవి చేపట్టిన తర్వాత తాను చేసిన పనులు, సాధించిన విజయాల గురించి వివరించారు. ఇదే మీటింగ్‌లో భారత్, చైనా సహా పలు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలు వచ్చే నెల 2 నుంచి అమలు చేస్తామని వెల్లడించారు.
కొన్ని దేశాలు దశాబ్దాల పాటూ అమెరికాపై టారిఫ్‌లు విధుస్తున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారత్ వంటి చాలా దేశాలు తమ నుంచి అధిక సుంకాలు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఇది చాలా అన్యాయమన్నారు. భారత్ తమపై 100 శాతం కంటే ఎక్కువ టారిఫ్‌లు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ‘భారత్ మాపై 100 శాతం కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేస్తోంది. మా ఉత్పత్తులపై చైనా సగటు సుంకం మనం వసూలు చేసే దానికంటే రెండింతలు ఎక్కువ. ఇక దక్షిణ కొరియా సగటు సుంకం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనకు సమయం వచ్చింది. ఏప్రిల్ 2 నుంచి ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు ఉంటాయి. ఆయా దేశాలు మన ఉత్పత్తులపై ఎంత టారిఫ్‌లు విధిస్తే మనమూ తిరిగి అంతే వసూలు చేస్తాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com