Trump Tariff : సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కిన ట్రంప్..ప్రపంచ దేశాలపై 10 శాతం అదనపు పన్ను బాంబు.

Trump Tariff : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తన దేశ సుప్రీంకోర్టులోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఈ ఓటమితో ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు సరే కదా, మరింత దూకుడు పెంచారు. విదేశీ వస్తువులపై ఆయన విధించిన భారీ టారిఫ్‌లు చెల్లవని కోర్టు తీర్పునిచ్చిన కొన్ని గంటల్లోనే, ట్రంప్ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఏకంగా 10 శాతం అదనపు గ్లోబల్ టారిఫ్ విధిస్తూ కొత్త ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నిర్ణయం ఫిబ్రవరి 24వ తేదీ అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానుంది.
అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద పన్నులు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని, ఆ అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తేల్చి చెప్పింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ తీర్పును అత్యంత నిరాశాపరమైనదిగా అభివర్ణించడమే కాకుండా, కోర్టులోని కొందరు సభ్యులను దేశద్రోహులు అని కూడా సంబోధించారు. విదేశీ శక్తుల ప్రభావంతోనే ఇలాంటి తీర్పులు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. నేను ఒక దేశాన్ని నాశనం చేయగలను కానీ, పన్ను వసూలు చేయలేనా? ఇది ఎంత హాస్యాస్పదం! అంటూ తన అసహనాన్ని వెళ్లగక్కారు.
సుప్రీంకోర్టు తీర్పును అధిగమించేందుకు ట్రంప్ 1974 నాటి వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122ను తెరపైకి తెచ్చారు. అమెరికా చెల్లింపుల శేషం సమస్యలను పరిష్కరించడానికి ఈ సెక్షన్ కింద అధ్యక్షుడికి 150 రోజుల పాటు 15 శాతం వరకు పన్నులు విధించే అధికారం ఉంటుంది. గతంలో ఎన్నడూ వాడని ఈ నిబంధనను ట్రంప్ ఇప్పుడు వాడుతున్నారు. ఈ 150 రోజుల తర్వాత పన్నులను పొడిగించాలంటే మాత్రం కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. ప్రస్తుతానికి 10 శాతం పన్ను విధిస్తూనే, మున్ముందు దేశాల వాణిజ్య విధానాలపై విచారణ జరిపి మరిన్ని టారిఫ్‌లు బాదుతామని ఆయన హెచ్చరించారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చైనా, కెనడా, మెక్సికోతో పాటు భారత్ వంటి దేశాలపై కూడా ప్రభావం పడనుంది. ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి రానున్న ఈ 10 శాతం పన్ను.. ఇప్పటికే ఉన్న సాధారణ పన్నులకు అదనంగా ఉంటుంది. దీనివల్ల అమెరికాలో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. రాబోయే పదేళ్లలో ఈ టారిఫ్ పాలసీ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు 3 ట్రిలియన్ డాలర్ల నష్టం రావచ్చని బడ్జెట్ కార్యాలయం అంచనా వేస్తున్నా, ట్రంప్ మాత్రం తన మొండివైఖరితో ముందుకు వెళ్తున్నారు. నేను అనుకున్నది చేయగలను అని చెబుతూ ప్రపంచ వాణిజ్య యుద్ధానికి ఆయన సిద్ధమయ్యారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
