Donald Trump : ట్రంప్ ఉగ్రరూపం.. రష్యాతో వ్యాపారం చేస్తే భారీ మూల్యం తప్పదు.

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రష్యా విషయంలో తీవ్రంగా స్పందించారు. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తున్న దేశాలపై ఆదివారం బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా, మాటల్లోనే ఇరాన్‌ను త్వరలోనే బ్లాక్ లిస్ట్ చేసే అవకాశం ఉందని కూడా పరోక్షంగా సూచించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడానికి ట్రంప్ ఈ కఠినమైన వైఖరిని ప్రదర్శించారు.
ఫ్లోరిడాలోని పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్..తన రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు రష్యాతో వాణిజ్య సంబంధాలు ఉన్న దేశాలపై ఆంక్షలు విధించేందుకు కొత్త చట్టాలను రూపొందిస్తున్నారని తెలిపారు. "రష్యాతో వ్యాపారం చేసే ఏ దేశంపై అయినా చాలా కఠినమైన ఆంక్షలు విధిస్తాం" అని ఆయన స్పష్టం చేశారు. ఈ జాబితాలో ఇరాన్‌ను కూడా చేర్చాలని తాను సూచించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ఈ ప్రకటనకు ముందే ట్రంప్ పరిపాలన రష్యాకు చెందిన రెండు అతిపెద్ద చమురు కంపెనీలైన రోస్‌నెఫ్ట్, లుకోయిల్ లపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల ప్రకారం అమెరికాలో ఈ రెండు కంపెనీలకు చెందిన మొత్తం ఆస్తులను జప్తు చేయడం జరిగింది. అంతేకాకుండా అమెరికన్ పౌరులు ఎవరూ ఈ కంపెనీలతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకూడదని నిషేధం విధించారు. ఈ చర్యలు రష్యా ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీసే లక్ష్యంతో తీసుకున్నారు.
అమెరికా ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేందుకు ససేమిరా అంటున్నారు. అమెరికా ఆంక్షలపై స్పందించిన పుతిన్, "ఏ ఆత్మగౌరవం ఉన్న దేశం లేదా వ్యక్తి అయినా ఒత్తిడికి తలొగ్గి నిర్ణయాలు తీసుకోరు" అని గత నెలలో గట్టిగా చెప్పారు. అంతేకాకుండా అమెరికా విధించే ఆంక్షల వల్ల ప్రపంచ చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని, దాని ప్రభావం చివరికి వాషింగ్టన్‌పైనే పడుతుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

