Trump : అమెరికా తీరుపై సర్వత్రా విమర్శలు.. ట్రంప్ ఇక మారడా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు “ప్రజాస్వామ్యానికి పెద్దన్న” అని చెప్పుకున్న అమెరికా, ఇప్పుడు తన ఆర్థిక, సైనిక శక్తిని అడ్డుపెట్టుకుని ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాల్లో ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో విషయంలో అమెరికా వ్యవహరించిన తీరు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడంటూ ఆరోపణలు చేసి, వెనెజువెలాను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేసింది అమెరికా. ఇది కేవలం డ్రగ్స్ అంశం మాత్రమే కాదని, అసలు లక్ష్యం వెనెజువెలా చమురేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు.
వెనెజువెలా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటి. ఆ దేశంపై ఆధిపత్యం సాధిస్తే, ప్రపంచ చమురు మార్కెట్‌పై గుత్తాధిపత్యం చెలాయించవచ్చన్న ఆలోచనతోనే అమెరికా అడుగులు వేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో క్యూబా, కొలంబియా, గ్రీన్‌లాండ్ వంటి దేశాలపై కూడా ట్రంప్ బహిరంగంగా బెదిరింపులకు దిగడం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో చూపిస్తోంది. “కొలంబియాను లాగేసుకుంటా”, “గ్రీన్‌లాండ్ కావాలి”, “క్యూబాను నియంత్రించాలి” వంటి వ్యాఖ్యలు ఒక అధ్యక్షుడి నోట రావడం అంతర్జాతీయ దౌత్య నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి.
ఇక తాజాగా ట్రంప్ చేసిన మరో కామెంట్ మరింత ఆందోళన కలిగిస్తోంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు ఆపకపోతే 500 శాతం టారిఫ్‌లు విధిస్తామని బెదిరించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఏ దేశం ఎక్కడి నుంచి ఏం కొనాలో నిర్ణయించే అధికారం ట్రంప్‌కు ఎక్కడిది. స్వతంత్ర దేశాల ఆర్థిక నిర్ణయాల్లో అమెరికా ఇలా జోక్యం చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం కాదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవడానికే ట్రంప్ ఈ ఆక్రమణలు, బెదిరింపుల రాజకీయాన్ని నడుపుతున్నాడన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తన దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, అప్పులు, ఆర్థిక అసమానతలను దాచేందుకు ఇతర దేశాలపై దాడులు చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదని విశ్లేషకులు అంటున్నారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకు తలొగ్గకూడదు అనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తూ, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవాలన్న ఆశయంతో ప్రజలు ఉన్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

