Trump Tariffs : ట్రంప్ టారిఫ్ దెబ్బ.. అమెరికాకు భారత ఎగుమతులు బంద్!

Trump Tariffs : ట్రంప్ టారిఫ్ దెబ్బ.. అమెరికాకు భారత ఎగుమతులు బంద్!
X

Trump Tariffs : అమెరికాలో దిగుమతి సుంకాల విషయంలో నెలకొన్న గందరగోళం భారత ఎగుమతిదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అగ్రరాజ్యానికి సరుకు పంపే మన దేశపు టెక్స్‌టైల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, సీఫుడ్ రంగాల వ్యాపారులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. అమెరికా వెళ్లాల్సిన కొన్ని కోట్ల రూపాయల విలువైన సరుకు షిప్‌మెంట్లను ఎగుమతిదారులు మధ్యలోనే నిలిపివేశారు. కొత్త రూల్స్ ఏంటి? ఏ వస్తువుపై ఎంత ట్యాక్స్ పడుతుంది? అనే విషయంలో క్లారిటీ వచ్చే వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదని భారత వ్యాపారులు నిర్ణయించుకున్నారు.

అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పుతోనే ఈ అసలు కథ మొదలైంది. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్(IEEPA) కింద అప్పట్లో విధించిన టారిఫ్స్‌ను కోర్టు కొట్టివేయడంతో పాత ఒప్పందాల చట్టబద్ధతపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ తీర్పు వచ్చిన కొద్ది గంటల్లోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 122 కింద సరికొత్త గ్లోబల్ టారిఫ్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొదట ఈ పన్ను 10 శాతంగా ఉంటుందని చెప్పినప్పటికీ, మరుసటి రోజే దానిని ఏకంగా 15 శాతానికి పెంచడం ఎగుమతిదారులను షాక్‌కు గురిచేసింది.

ఈ టారిఫ్ మార్పుల ప్రభావం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి వెళ్లే రొయ్యల (సీఫుడ్) ఎగుమతులపై తీవ్రంగా ఉంది. సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు గుంటూరు పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా కొనుగోలుదారుల సూచన మేరకు ప్రస్తుతానికి షిప్‌మెంట్లను నిలిపివేశారు. అమెరికాకు భారత్ చేసే అతిపెద్ద వ్యవసాయ ఎగుమతి రొయ్యలే కావడం గమనార్హం. గత ఏడాది ఇది సుమారు 2.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అటు రత్నాలు, ఆభరణాల రంగం పరిస్థితి కూడా అలాగే ఉంది. దాదాపు 10 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసే ఈ రంగం, ట్రంప్ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతుందోనని భయపడుతూ వారం రోజులుగా సప్లైను ఆపేసింది.

ఇక టెక్స్‌టైల్ రంగంలో కూడా ఇదే ఆందోళన కనిపిస్తోంది. ఇంతకాలం అమెరికాతో ఉన్న ప్రత్యేక వాణిజ్య ఒప్పందాల వల్ల భారతీయ వస్త్రాలకు ఇతర దేశాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కానీ కొత్తగా విధించిన 15 శాతం టారిఫ్ వల్ల ఆ వెసులుబాటు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు భారత్ కూడా ఇతర దేశాల మాదిరిగానే పోటీ పడాల్సి వస్తోంది. "వ్యాపారం ఎంత కష్టమైనా చేయవచ్చు కానీ, అనిశ్చితి మధ్య చేయడం అసాధ్యం" అని క్లోతింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నిపుణులు వ్యాఖ్యానించారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వెబ్‌సైట్‌లో వచ్చే అప్‌డేట్స్ కోసం ఇప్పుడు మన ఎగుమతిదారులందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story