Libya floods : తూర్పు లిబియాలో భారీ వరదలు..

భారీ తుపాను, ఎడతెరిపి లేని వానల కారణంగా వరదలు సంభవించడంతో తూర్పు లిబియా దేశంలోవరదలు ముంచెత్తాయి. డెర్నా నగరంలో 2వేల మంది మరణించారని, వేలాదిమంది వరదల్లో గల్లంతు అయ్యారని తూర్పు లిబియా అధికారులు చెప్పారు. డెర్నా పైన ఉన్న డ్యామ్‌లు కూలడంతోనే ఈ విపత్తు సంభవించినట్టు లిబియన్ నేషనల్ ఆర్మీ (ఎల్ఎన్ఏ) తెలిపింది. వరదల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సముద్రంలోకి కొట్టుకుపోయినట్టు పేర్కొంది.
ఈ విపత్తులో 2 వేల మందికిపైగా మరణించారని, వేలాదిమంది గల్లంతయ్యారని తూర్పు ప్రాంత అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. వరద 10 అడుగుల మేర ముంచెత్తినట్టు స్థానికులు తెలిపారు. పశ్చిమ డెర్నా ధ్వంసమైన రోడ్లు, కుప్పకూలిన ఇళ్లతో భయానకంగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. విద్యుత్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు. దేశంలో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. తూర్పు లిబియా ఆరోగ్యశాఖ మంత్రి ఒత్మాన్ అబ్లుల్ జలీల్ సోమవారం మధ్యాహ్నం ఏఎల్-అరేబియా న్యూస్ ఛానెల్‌కు టెలిఫోన్ ఇంటర్వ్యూలో మరణాల సంఖ్యను ప్రకటించారు. 50 మంది గల్లంతైనట్లు తెలిపారు. అయితే తాను చెప్పిన మరణాల సంఖ్యలో డెర్నా నగర మృతులను చేర్చలేదని చెప్పారు. అయితే డెర్నాలో 250 మంది ప్రాణాలు కోల్పోయినట్టు నిన్న రెడ్ క్రీసెంట్ ఎయిడ్ గ్రూప్ తెలిపింది.
మధ్యధరా తుపాన్ డేనియల్ లిబియాలో వినాశనానికి కారణమైంది. ఈ తుపాన్ ప్రభావం వల్ల ఉత్తర ఆఫ్రికా దేశంలోని తీర పట్టణాల్లో వ్యవసాయభూములు వరదనీటితో మునిగిపోయాయి. డెర్నా పట్టణంలోని నదిపై ఉన్న ఆనకట్ట వరదలతో కూలిపోవడంతో విపత్తు సంభవించిందని లిబియా నేషనల్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ మిస్మారీ చెప్పారు. ఈ వరద విపత్తులో గల్లంతైన వారి సంఖ్య 6 వేలమంది దాకా ఉంటుందని ఆర్మీ ప్రతినిధి పేర్కొన్నారు.
లిబియా 2011లో రాజకీయంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విడిపోయింది. ఆరు మిలియన్లకుపైగా జనాభా కలిగిన లిబియా.. దశాబ్దానికిపైగా ఘర్షణలతో సతమతమవుతోంది. మౌలిక సదుపాయాల లేమితో బాధపడుతోంది. 2011లో నాటో మద్దతుతో కూడిన తిరుగుబాటు కారణంగా నియంత మొఅమ్‌మర్ గడాఫీ మరణం తర్వాత లిబియా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com