ఉక్రెయిన్ డ్యాంను కూల్చిన రష్యా..60 వేల మంది జీవితాలు అతలాకుతలం

ఉక్రెయిన్‌లోని కఖోవ్కా డ్యాంను రష్యా పేల్చేయడంతో ఖేర్సన్ నగరం నీట మునిగింది. డ్యాంలోని నీరంతా బయటికి వస్తుండటంతో నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గంటగంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. 60 వేల మంది ప్రజల జీవితాలను అతలాకుతలమయ్యాయి. పలు గ్రామాలు, పట్టణాలు ఇప్పటికీ వరదనీటిలోనే ఉన్నాయి. ప్రజల్ని రక్షించేందుకు ఉక్రెయిన్ సైన్యం భారీస్థాయిలో సహాయక చర్యలను ప్రారంభించింది. బోట్లు, ఇతర వాహనాల్లో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. తాగునీరు ఏర్పాట్లు చేస్తోంది.
వందలాది మంది ప్రజలు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల పైకప్పులపై పడుకున్నారు. మరికొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లు విడిచి వెళ్లిపోయార. దినిప్రో నది తీరంలో 1,800కు పైగా ఇళ్లు ముంపునకు గురయ్యాయి. వరద ప్రవాహం కారణంగా మైఖోలోవ్ లోని బ్రిడ్జిలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. డ్యామ్ పేల్చేసిన తర్వాత ఏడుగురు గల్లంతైనట్లు తెలుస్తంది. నోవా కఖోవ్కాకు చెందిన 900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఖేర్సన్ లో పశ్చిమ ప్రాంతం ఉక్రెయిన్ అధీనంలో ఉంది. తూర్పు ప్రాంతాన్ని యుద్ధం ఆరంభంలోనే మాస్కో ఆక్రమించింది. రష్యా ఆక్రమిత ప్రాంతంలో సహాయక చర్యలు సక్రమంగా జరగడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. 40 వేల మంది ప్రభావితమైన ప్రాంతం నుంచి రష్యా కేవలం 1300 మందిని మాత్రమే తరలించింది. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com