Syria : సిరియాపై అమెరికా బాంబుల మోత!

ఓవైపు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న తరుణంలో.. అగ్రరాజ్యం అమెరికా సిరియాపై విరుచుకుపడుతోంది. అక్కడి ఐసిస్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా వరుస గగనతల దాడులు చేస్తోంది. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో పాటు దాని మిత్రదేశాలపై ఐసిస్ దాడులు చేసేందుకు పన్నాగం పన్నుతోందని అగ్రరాజ్యానికి కచ్చితమైన సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ దాడుల్లో సిరియాలోని సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ తన ప్రకటనలో పేర్కొంది. ఇటీవల కాలంలో సిరియాపై అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి. సెప్టెంబరు నెల చివరిలో ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా అమెరికా గగనతల దాడులు చేసింది. ఈ దాడుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రకటించింది. వారంతా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదా అనుబంధ సంస్థలకు చెందినవారేనని తెలిపింది. మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com