US Attacks : యెమెన్ పై అమెరికా దాడులు.. 68 మంది మృతి

హౌతీ ఉగ్రవాదులే లక్ష్యంగా యెమెన్ పై అగ్రరాజ్యం అమెరికా శక్తివంతమైన క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఆదివారం రాత్రి చేసిన క్షిపణి దాడిలో సుమారు 68 మంది మరణించారు. 47 మంది గాయపడ్డారు. హౌతీ రెబల్స్ సోమవారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆఫ్రికా వలసదారులున్న యెమెన్ లోని సాదా గవర్నరేట్ జైలును యూఎస్ క్షిపణులు తాకాయని చెప్పారు. అయితే దీనిపై అమెరికా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
హౌతీ మిలిటెంట్ల ఏరివేత లక్ష్యంగా మార్చి 15 నుంచి అమెరికా యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో నెలన్నరలో ఇప్పటివరకు హొతీలపై సుమారు 800 క్షిపణులతో దాడులు చేసినట్లు యూఎస్ వెల్లడించింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది. తమ దూకుడు వల్ల అంతర్జాతీయ నౌకలపై హౌతీల దాడులు తగ్గినట్లు తెలిపింది. ఇందులో బాలిస్టిక్ క్షిపణులు 69శాతం, డ్రోన్ దాడులు 55 శాతం తగ్గినట్లు వివరించింది. నౌకలపై దాడులను నిలిపివేసి ప్రశాంత వాతవారణం వచ్చేవరకు హౌతీ మిలిటెంట్లపై దాడులు చేస్తాం. ఆపరేషన్ రఫ్ రైడర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 800 క్షిపణి దాడులు చేశాం. దీంతో వందలాది హూతీ ఉగ్రవాదులతో పాటు నేతలు, అధికారులు మరణించారు. ఇంకా అనేక కార్యాలయాలతో పాటు గగనతల రక్షణ వ్యవస్థ, అత్యాధునిక ఆయుధాల ఉత్పత్తి, భద్రత వ్యవస్థలను ధ్వంసం చేశాం అని సదరు ప్రకటనలో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com