U.S.-China : మరింత ముదిరిన అమెరికా-చైనా ట్రేడ్ వార్

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ఉద్ధృతం అవుతోంది. తాజాగా చైనా ఉత్పత్తులపై ఏకంగా 245 శాతానికి సుంకాలు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు చైనా విమానయాన సంస్థలు యూఎస్‌కు చెందిన కొత్త బోయింగ్ జెట్ ఆర్డర్లలపై నిషేధం విధించాయి. జిన్‌పింగ్ సర్కార్ కూడా యూఎస్‌కు వ్యతిరేకంగా అనేక దూకుడు చర్యలు చేపట్టింది. దీనితో డ్రాగన్‌కు కళ్లెం వేయడానికే అమెరికా ఈ విధంగా ప్రతీకార సుంకాలను మరింత పెంచింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక 'అమెరికా ఫస్ట్' అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను మళ్లీ గొప్పగా మార్చడానికి కృషి చేస్తున్నారు. అందుకే వాణిజ్య లోటు ఉన్న దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ, వాణిజ్య యుద్ధం ప్రకటించారు. దీనితో స్టాక్ మార్కెట్లు దారుణంగా నష్టపోయాయి. దీనితో దాదాపు 75 దేశాలు ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలపై చర్చించడానికి సిద్ధపడ్డాయి.
చైనా మాత్రం అగ్రరాజ్యం అమెరికాకు తలొగ్గలేదు. దీనితో అమెరికా, చైనా వస్తువులపై ఏప్రిల్ నెల ప్రారంభంలో 145 శాతానికి సుంకాలు పెంచింది. దీనితో చైనా కూడా అమెరికా ఉత్పత్తులలపై 125 శాతానికి సుంకాలు పెంచింది. అక్కడితో ఆగకుండా అమెరికాకు అవసరమైన హైటెక్, రక్షణ పరిశ్రమలకు ఉపయోగపడే అత్యంత అరుదైన ఖనిజాలు, లోహాలు, అయస్కాంతాల ఎగుమతులను చైనా ఆపేసింది. దీనితో అమెరికా జాతీయ భద్రత సమీక్ష చేసి, తాజాగా చైనాపై మోయలేని సుంకాల భారాన్ని మోపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com