US Economic Growth : ట్రంప్ టారిఫ్‌ల మాయాజాలమా? ఊహించని వృద్ధి సాధించిన అమెరికా.

US Economic Growth : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల మాయాజాలం నిజంగా పనిచేసిందా? అంటే అవుననే అనిపిస్తున్నాయి అమెరికా ఆర్థిక వృద్ధి గణాంకాలు. అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ, అమెరికా వృద్ధి రేటు ఏకంగా 4 శాతాన్ని దాటింది. ముఖ్యంగా ఈ వృద్ధి గణాంకాలు రెండేళ్ల రికార్డును బద్దలు కొట్టాయి. ట్రంప్ టారిఫ్ విధానంపై అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ తన విధానాల కారణంగా అమెరికన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తారని చాలా మంది అంచనా వేశారు, కానీ ఈ గణాంకాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
అమెరికన్ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 4.3 శాతం చొప్పున పెరిగింది. ఇది గత రెండు సంవత్సరాలలో నమోదైన అత్యంత వేగవంతమైన వృద్ధి. బలమైన వినియోగదారుల ఖర్చు, ప్రభుత్వ వ్యయం, ఎగుమతుల బలం కారణంగా ఈ వృద్ధి అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది. అమెరికా వాణిజ్య విభాగం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి వృద్ధి ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నమోదైన 3.8 శాతం కంటే వేగంగా ఉంది. డేటా సంస్థ ఫ్యాక్ట్‌సెట్ నిర్వహించిన సర్వే ఈ కాలానికి దాదాపు మూడు శాతం వృద్ధిని మాత్రమే అంచనా వేసింది, కానీ వాస్తవ వృద్ధి వాటిని మించిపోయింది.
ఈ వృద్ధికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఫెడరల్ రిజర్వ్ కోరుకుంటున్న స్థాయి కంటే ఎక్కువగా ఉంది. ఫెడ్ రిజర్వ్ అభిమాన ద్రవ్యోల్బణం సూచిక అయిన వ్యక్తిగత వినియోగ వ్యయ సూచీ సెప్టెంబర్ త్రైమాసికంలో 2.1 శాతం నుంచి 2.8 శాతానికి పెరిగింది. అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉన్న వినియోగదారుల వ్యయం గత త్రైమాసికంలో 3.5 శాతానికి పెరిగింది. అదేవిధంగా రాష్ట్ర, స్థానిక స్థాయిలో ఖర్చుతో పాటు ఫెడరల్ రక్షణ వ్యయం మద్దతుతో ప్రభుత్వ వినియోగం, పెట్టుబడి 2.2 శాతం పెరిగింది. అయితే దీనికి విరుద్ధంగా, ప్రైవేట్ వ్యాపార పెట్టుబడి గత త్రైమాసికంలో 0.3 శాతం తగ్గింది.
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ శ్రామిక మార్కెట్‌లో వచ్చిన బలహీనత కారణంగా 2025 చివరి నాటికి వరుసగా మూడు సార్లు వడ్డీ రేట్లను తగ్గించింది. గత వారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నవంబర్‌లో 64,000 కొత్త ఉద్యోగాలు మాత్రమే చేరాయి. అక్టోబర్‌లో ఉపాధి రేటు 1.05 లక్షలు తగ్గింది. నిరుద్యోగిత రేటు గత నెలలో 4.6 శాతానికి పెరిగింది, ఇది 2021 తర్వాత అత్యధిక స్థాయి. ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నప్పటికీ, శ్రామిక మార్కెట్‌లో బలహీనత అనేది ఫెడ్ రిజర్వ్‌కు ప్రధాన ఆందోళనగా మిగిలిపోయింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

