US Federal Reserve : అమెరికాలో మళ్లీ తగ్గిన వడ్డీ రేట్లు.. భారత్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందంటే ?

US Federal Reserve : అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను వరుసగా రెండోసారి తగ్గించింది. వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల కోతతో ప్రస్తుతం బెంచ్‌మార్క్ వడ్డీ రేటు 3.75%-4.00% మధ్య ఉంది. అమెరికా ఆర్థిక పరిస్థితులను బట్టి భవిష్యత్తులో వడ్డీ రేట్లను మరింత తగ్గించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ పావెల్ తెలిపారు.
ఈ ఏడాది వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని గతంలో చెప్పిన ఫెడరల్ రిజర్వ్, ఇప్పుడు వరుసగా రెండుసార్లు రేట్లను తగ్గించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వడ్డీ రేట్ల తగ్గింపుపై ఫెడరల్ రిజర్వ్‌పై ఒత్తిడి తెచ్చారు. ప్రస్తుత నిర్ణయం ట్రంప్ ఒత్తిడికి పావెల్ తలొగ్గినట్లు కనిపిస్తోంది.
భారత్‌పై ప్రభావం
ఫెడరల్ రిజర్వ్ వరుసగా రెండోసారి వడ్డీ రేట్లను తగ్గించడం ప్రపంచ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. అమెరికా స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందించగా, ఆసియా మార్కెట్లు కాస్త నిస్తేజంగా ఉన్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలు ముందు నుంచీ ఉన్నాయి. బహుశా ఇదే కారణమో లేక కాకతాళీయమో కానీ, ఇటీవల విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్‌లో పెట్టుబడులను పెంచారు. భారత స్టాక్ మార్కెట్ కోలుకోవడానికి ఇది ఒక కారణంగా నిలిచింది.
ఈరోజు నిఫ్టీ సూచీ ఉదయం సెషన్‌లో రెడ్ మార్క్‌లోకి వెళ్లింది. అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపునకు స్పందించకుండా, భారత మార్కెట్ సాధారణంగానే ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం నిఫ్టీ50 సూచీ 25,900 పాయింట్ల మార్క్ వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపుతో మరింత మంది విదేశీ ఇన్వెస్టర్లు వచ్చి నిఫ్టీని 26,100 పాయింట్ల స్థాయి కంటే పైకి తీసుకెళ్తారని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

