US congratulations: భారత్ లో ఎన్నికల నిర్వహణపై అమెరికా ప్రశంసలు..

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల నిర్వహణపై అమెరికా ప్రశంసలు కురిపించింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అభినందనలు తెలియజేసింది. ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు..? అన్న దానిపై తాము వ్యాఖ్యలు చేయబోమని, ఎవరు గెలిచినా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తామని పేర్కొంది.
‘భారీ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన భారత ప్రభుత్వాన్ని, అందులో పాల్గొన్న భారత ఓటర్లను అభినందిస్తున్నాం. గెలుపోటములపై మేం స్పందించబోం. అది మా విదేశాంగ విధానం. ఎవరు గెలిచినా భారత ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగుతాయి’ అని ఆమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అభిప్రాయపడ్డారు. భారత ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.
ఆయా దేశాల్లోని పరిణామాలపై తాము సందర్భానుసారంగా స్పందిస్తామని తెలిపారు. అంతమాత్రాన అది జోక్యం చేసుకోవడం కాదని మిల్లర్ చెప్పారు. ఇదిలావుంటే ప్రధాని మోదీకి, ఎన్డీయే కూటమికి ‘యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్’ అభినందనలు తెలియజేసింది. భారత ఎన్నికల సంఘం తుది ఫలితాలను బుధవారం తెల్లవారుజామున ప్రకటించింది. అధికార భాజపా 240, కాంగ్రెస్ 99 స్థానాల్లో గెలుపొందాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com