Marco Rubio : ప్రపంచంలోనే అమెరికాతో అత్యున్నత సంబంధాలు కగిలి ఉన్న దేశాల్లో భారత్ ఒకటి : మార్కో రూబియో

ప్రపంచంలో అమెరికా కలిగి ఉన్న అత్యుత్తమ సంబంధాల్లో భారతదేశం ఒకటి అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఢిల్లీలో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ నియమితులయ్యారు. సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీలో నిర్ధారణ విచారణ సందర్భంగా రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. విచారణలో సెర్గియో గోర్‌ను రూబియో పరిచయం చేస్తూ ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారతదేశం ముఖమైందని తెలిపారు. ఇక సెర్గియో గోర్.. అధ్యక్షుడి విశ్వాసానికి తగిన విధంగా భారత్‌లో పని చేస్తారని చెప్పారు. ట్రంప్‌తో గోర్‌కు మంచి సన్నిహిత సంబంధం ఉందని పేర్కొన్నారు. అధ్యక్షుడికి చాలా దగ్గరగా.. ఓవల్ కార్యాలయంలో నమ్మకంగా పని చేశారని ప్రశంసించారు. గోర్ కంటే మంచిగా పని చేసేవారు ఎవరూ ఉండరని తెలిపారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ చర్చలు ఫలించడం లేదు. ఇంతలోనే ఆయా దేశాలపై ట్రంప్ సుంకాలు ప్రకటించారు. ఇందులో భాగంగా భారత్‌పై తొలుత 25 శాతం సుంకం విధించారు. అంతలోనే మరో బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. ఈ పరిణామంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం కారణంగానే ఉక్రెయిన్‌తో మాస్కో శాంతి ఒప్పందానికి రావడం లేదని అమెరికా వాదిస్తోంది. అయితే ఎక్కడ తక్కువగా దొరికితే అక్కడే చమురు కొనుగోలు చేస్తామని భారత్ అంటోంది. ఇక అన్నదాతల కోసం ఎంత సుంకమైనా భరిస్తామని మోడీ ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com