Trump Tariffs : 13 శాతమా? 18 శాతమా? అమెరికాలో భారత వస్తువులపై పన్ను ఎంత? ట్రంప్ టారిఫ్ లెక్కలివే.

Trump Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ దేశాల ఎగుమతిదారులకు పెద్ద తలపోటుగా మారాయి. ముఖ్యంగా భారతీయ వస్తువులపై పన్ను ఎంత ఉంటుంది? 18 శాతమా, 10 శాతమా లేక కేవలం 3 శాతమా? అనే అయోమయం నెలకొంది. అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు మరియు ట్రంప్ కొత్తగా ప్రకటించిన గ్లోబల్ టారిఫ్ నేపథ్యంలో ఈ పన్నుల లెక్కలు పూర్తిగా మారిపోయాయి. భారతీయ ఎగుమతిదారులు అసలు ఎంత టాక్స్ కట్టాలో వివరంగా తెలుసుకుందాం.
అమెరికా సుప్రీం కోర్టు ట్రంప్ విధించిన అత్యవసర టారిఫ్ నిర్ణయాలను కొట్టివేయడంతో, భారతీయ వస్తువులపై పన్నులు ఒక్కసారిగా తగ్గిపోయాయి. గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో, ఇతర వాణిజ్య విభేదాల వల్ల భారత వస్తువులపై పన్ను 50 శాతానికి చేరింది. ఆ తర్వాత ఒప్పందాల వల్ల అది 18 శాతానికి తగ్గింది. అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో భారత్ మళ్లీ మోస్ట్ ఫేవరెట్ నేషన్ హోదాలోకి వచ్చేసింది. దీనివల్ల భారత వస్తువులపై సగటు పన్ను మళ్లీ పాత పద్ధతిలో కేవలం 3 శాతానికి పడిపోయింది. అంటే టెక్నికల్ గా భారత్‌కు ఇది పెద్ద విజయమే.
అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. 1974 ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 122 కింద అమెరికాలోకి వచ్చే అన్ని విదేశీ వస్తువులపై అదనంగా 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 24 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇది కనీసం 150 రోజుల పాటు అమల్లో ఉంటుంది. దీని కోసం తనకు కాంగ్రెస్ అనుమతి అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అంటే ఇప్పుడు భారత వస్తువులపై బేస్ పన్ను 3 శాతం + ట్రంప్ అదనపు పన్ను 10 శాతం.. మొత్తం కలిపి 13 శాతం వరకు టారిఫ్ పడే అవకాశం కనిపిస్తోంది.
భారత్ నుంచి ఎగుమతి అయ్యే మొబైల్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్ వంటి కీలక రంగాలకు పాత ఒప్పందాల ప్రకారం మినహాయింపులు కొనసాగే అవకాశం ఉంది. కానీ స్టీల్, ఆటోమొబైల్ వంటి వస్తువులపై నేషనల్ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం విడివిడిగా పన్నులు ఉంటాయి. ట్రంప్ మాటల్లో చెప్పాలంటే.. భారత్‌తో వాణిజ్య ఒప్పందంలో పెద్దగా మార్పు లేదు, కానీ అమెరికా ప్రయోజనాలే మాకు ముఖ్యం. అంటే ఏప్రిల్ నుంచి మొదలైన ఈ పన్నుల యుద్ధం ఇప్పుడు 13 శాతం వద్ద నిలకడగా ఉండేలా కనిపిస్తోంది. 50 శాతం భయం నుంచి 13 శాతానికి తగ్గడం భారత్‌కు ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ, ఈ 10 శాతం అదనపు భారం మన ఎగుమతిదారుల లాభాలపై ప్రభావం చూపవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
