TRUMP: మోదీ నాకు మంచి స్నేహితుడు: ట్రంప్

TRUMP: మోదీ నాకు మంచి స్నేహితుడు: ట్రంప్
X
మోదీ లాంటి నాయకుడిని కలవడం గర్వకారణమన్న ట్రంప్... త్వరలోనే భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం

భారత్‌కు ప్రధాని మోదీ లాంటి నాయకుడు ఉండడం గర్వకారణం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మోదీ భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడారు. ‘మోదీ నాకు మంచి ఫ్రెండ్. మోదీని కలవడం గౌరవంగా భావిస్తున్నా. భవిష్యత్‌లో భారత్, అమెరికా కలిసి పని చేస్తాయి. త్వరలోనే భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం ఉంటుంది’ అని చెప్పారు. అలాగే, ఉక్రెయిన్‌ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో గంటన్నర మాట్లాడినట్లు పేర్కొన్నారు. ట్రంప్‌తో మోదీ వాణిజ్యం, ఇరు దేశాల సంబంధాల బలోపేతం, సుంకాలపై ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో విదేశాంగ మంత్రి జైశంకర్ ఉన్నారు. కాగా, ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి.

అమెరికా నుంచి భారత్‌కు ఉగ్రవాది

ముంబై ఉగ్ర దాడుల నిందితుడు తహవ్వూర్ రాణాను భారత్‌కు పంపించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలిపారు. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం ముగిసిన తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ‘2008 నాటి భయంకరమైన ముంబై ఉగ్రవాద దాడితో సంబంధం ఉన్న కుట్రదారులలో ఒకరిని.. భారత్ కు అప్పగించేందుకు నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను. ’ అని ట్రంప్ ప్రకటించారు.

ట్రంప్‌ కీలక నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘విదేశీ వాణిజ్యంలో న్యాయమైన ప్రయోజనాల కోసం ప్రతీకార సుంకాలను వసూలు చేయాలని నిర్ణయించుకున్నాను. అంటే అమెరికా దిగుమతులపై ఏ దేశాలు సుంకాలు వసూలు చేసినా.. తిరిగి ఆయా దేశాలపై సుంకాలు వసూలు చేస్తాం. అలాగని ఎక్కువ, తక్కువ కాకుండా.. ఆయా దేశాలు మాకు ఎంత సుంకం విధిస్తున్నాయో, దానికి తగ్గట్లే మేం కూడా వసూలు చేస్తాం’ అని ట్రంప్‌ స్పషం చేశారు.

యుద్ధం ఆపేందుకు ప్రయత్నించా: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను ఈ యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. తాను అగ్రరాజ్య అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక.. రష్యా అధినేత పుతిన్ తో గంటన్నర సేపు ఫోన్ లో మాట్లాడినట్లు ట్రంప్ ప్రకటించారు. తమది శాంతి మార్గమని వెల్లడించారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని ట్రంప్-మోదీ విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story