USA: పోలీసుల దాష్టీకం.. నల్లజాతి యువకుడు మృతి

అమెరికాలో పోలీసుల తీరు మరోసారి వివాదాస్పదమైంది. మెంఫిస్ సిటీలో టైర్ నికోల్స్ అనే నల్లజాతి యువకుడిపై పోలీసులు దాడి చేయగా... యువకుడు చనిపోయాడు. ఈ ఘటన జనవరీ 7వ తేదిన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను అధికార వర్గాలు విడుదల చేశాయి. ఇందులోని దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో మెంఫిస్ పోలీసులు నికోల్స్‌ను ఆపినట్లు వార్తలు వచ్చాయి. ఐతే ఫుటేజీ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తానూ ఏ తప్పు చేయలేదని నికోల్స్ చెప్తున్నప్పటికీ పోలీసులు అతని పట్ల కఠినంగా వ్యవహరించారు.
ముందుగా అతడిని కారులో నుంచి బయటకు లాగారు పోలీసులు. చేతులు విరగొట్టాలంటూ ఓ పోలీసు ఆదేశించగా అతడిని రోడ్డుపై కాళ్లతో తొక్కిపెట్టారు. బాధితుడు వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. తర్వాత పెప్పర్ స్ప్రే, ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే వెపన్ ఉపయోగించారు. ఎలాంటి కనికరం లేకుండా పిడిగుద్దులు గుద్దారు. బాధతో వదిలేయమని ప్రాధేయపడుతున్న కనికరించలేదు. తర్వాత తీవ్రంగా గాయపడిన నికోల్స్‌ను హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ పదో తేదిన చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసులపై సెకండ్ డిగ్రీ హత్యా నేరం కింద కేసు నమోదైంది. నికోల్స్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దారుణాన్ని నిరసిస్తూ అమెరికాలోని అన్ని ప్రధాన నగరాల్లో శాంతి యుత నిరసనలు జరిగాయి. దీంతో మెంఫిస్ సిటీ పూర్తిగా స్తంభించిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com