WAR: మూడో ప్రపంచ యుద్ధం ముంగిట విశ్వం

మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతున్న వేళ అమెరికా చేపట్టిన ఒక కీలక సైనిక చర్య ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఆరు రోజులుగా కొనసాగుతున్న తీవ్ర ఘర్షణల నేపథ్యంలో అమెరికా తన అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు బాలిస్టిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరిణామం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రపంచ శక్తుల మధ్య ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో అమెరికా చేసిన ఈ క్షిపణి పరీక్ష వ్యూహాత్మక సందేశాన్ని పంపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా ఎయిర్ ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఖండాంతర అణు క్షిపణి ‘మినిట్‌మ్యాన్-III’ను కాలిఫోర్నియా తీరంలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి మార్చి 3వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ప్రయోగించారు. ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైందని అధికారులు వెల్లడించారు. పరీక్షలో ఉపయోగించిన క్షిపణి ఆయుధాలు లేకుండా ప్రయోగించబడిందని, దాని సాంకేతిక సామర్థ్యాలను పరిశీలించడమే లక్ష్యమని అమెరికా పేర్కొంది. ప్రయోగించిన క్షిపణి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మార్షల్ ఐలాండ్స్ ప్రాంతంలోని లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో చేరుకుందని యూఎస్ స్పేస్ ఫోర్స్ తెలిపింది.
అయితే ఈ పరీక్ష జరిగిన సమయం అంతర్జాతీయ స్థాయిలో అనేక అనుమానాలకు తావిస్తోంది. మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో ఈ క్షిపణి ప్రయోగం జరగడం యాదృచ్ఛికం కాదని అనేక రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఆరు రోజులుగా ఇరాన్ తన దాడులను తగ్గించకుండా కొనసాగిస్తుండగా, అమెరికా తన అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో ఈ పరీక్ష నిర్వహించి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా, వ్యూహాత్మకంగా బలమైన సందేశాన్ని పంపే ప్రయత్నంగా ఈ చర్యను కొందరు విశ్లేషిస్తున్నారు. మినిట్‌మ్యాన్-III ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను నిమిషాల వ్యవధిలో ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి ఉంది. అమెరికా అణు రక్షణ వ్యవస్థలో ఇది కీలక భాగంగా ఉంది. యుద్ధ పరిస్థితుల్లో ఈ క్షిపణి శత్రు దేశాలకు భారీ విధ్వంసాన్ని సృష్టించగలదని సైనిక నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆయుధాన్ని ప్రస్తుత ఉద్రిక్త సమయంలో పరీక్షించడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా అధికారికంగా మాత్రం ఈ పరీక్షను సాధారణ సాంకేతిక పరీక్షగా పేర్కొంటోంది. ఇటువంటి పరీక్షలు ముందుగానే రూపొందించిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని అదికారికంగా వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
