Middle East War : గల్ఫ్ యుద్ధం సెగ.. భారత్ లో గ్యాస్ సిలిండర్లకు కోతలు తప్పవా? కేంద్రం ఎమర్జెన్సీ ప్లాన్.

Middle East War : మిడిల్ ఈస్ట్‌లో మండుతున్న యుద్ధజ్వాలలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన ఈ పోరు ఇప్పుడు కేవలం ఆ దేశాలకే పరిమితం కాలేదు. రష్యా, చైనా కూడా రంగంలోకి దిగడంతో ఇది మూడో ప్రపంచ యుద్ధం దిశగా వెళ్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాకు పెద్ద ముప్పు ఏర్పడింది. ముఖ్యంగా భారత్ వంటి ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద పరీక్షగా మారింది. ఒకవేళ యుద్ధం ముదిరి సరఫరా ఆగిపోతే ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే భారీ ఎమర్జెన్సీ ప్లాన్ సిద్ధం చేస్తోంది.
పశ్చిమ ఆసియాలో గొడవలు పెరగడం, సౌదీ అరేబియాలోని రిఫైనరీలపై దాడులు జరగడంతో సోమవారం ఒక్కరోజే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 10 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 80 డాలర్లకు చేరాయి. ఐరోపాలో గ్యాస్ ధరలు 40 శాతం పైగా పెరిగాయి. హోర్ముజ్ జలసంధి గుండా ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోవడంతో భారత్‌కు ముప్పు పొంచి ఉంది. పరిస్థితిని సమీక్షించిన పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, దేశంలో ఇంధన లభ్యతకు ఎలాంటి డోకా లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఆలోచిస్తున్న ప్రధాన ఆప్షన్లలో పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై తాత్కాలికంగా నిషేధం విధించడం ఒకటి. దేశీయ అవసరాల కోసం వీటిని నిల్వ ఉంచాలని కేంద్రం భావిస్తోంది.
భారత్ తన పెట్రోల్‌లో మూడింట ఒక వంతు, డీజిల్‌లో పావు వంతును ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఒకవేళ యుద్ధం కారణంగా దిగుమతులు తగ్గితే, ఈ ఎగుమతులను ఆపేసి దేశంలోని వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూస్తారు. అయితే, అన్నింటికంటే ఎల్‌పిజీ గ్యాస్ విషయంలోనే భారత్ ఎక్కువగా ఆందోళన చెందుతోంది. మన దేశ అవసరాల్లో దాదాపు మూడింట రెండు వంతుల గ్యాస్‌ను మనం దిగుమతి చేసుకుంటున్నాము. ఇందులో 85-90 శాతం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. ప్రస్తుత నిల్వలు కేవలం రెండు వారాలకు మించి వచ్చేలా లేవు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌పిజీ రేషనింగ్ విధించడంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అంటే ఎవరికైతే ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఉంటాయో వారికి గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గించే అవకాశం ఉంది.
గల్ఫ్ దేశాల నుంచి సరఫరా నిలిచిపోతే, భారత్ తన దృష్టిని రష్యా వైపు మళ్లించనుంది. ఇప్పటికే రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు పెంచే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. రష్యా చమురు ట్యాంకర్లు ప్రస్తుతం సముద్రంలోనే ఉన్నాయి, వాటిని వెంటనే భారత్ వైపు మళ్లించే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగితే అమెరికా కూడా భారత్ రష్యా నుంచి చమురు తీసుకోవడానికి అభ్యంతరం చెప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్ వద్ద 17-18 రోజులకు సరిపడా చమురు నిల్వలు, 20-21 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు మాత్రమే ఉన్నాయి.
యుద్ధం గనక మరో నాలుగు వారాల పాటు కొనసాగితే ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ పోరు నెల రోజులు ఉండవచ్చని అంచనా వేయడం కలకలం రేపుతోంది. అందుకే ఇండియన్ ఆయిల్, హెచ్‌పిసిఎల్ వంటి ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే తమ రిఫైనరీల్లో ఎల్‌పిజీ ఉత్పత్తిని పెంచాయి. మొత్తానికి గల్ఫ్ యుద్ధం ముదిరితే సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ఉండాలని కేంద్రం అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
