Kirana Hills: కిరానా హిల్స్‌ లో ఏముంది ? త్రివిధ దళాల బ్రీఫింగ్‌లో ఎందుకు ప్రస్తావించారు?

Kirana Hills:  కిరానా హిల్స్‌ లో ఏముంది ? త్రివిధ దళాల బ్రీఫింగ్‌లో ఎందుకు ప్రస్తావించారు?
X
ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!

‘ఆపరేషన్ సిందూర్‌’ పై భారత రక్షణశాఖ అధికారులు నిర్వహించిన మీడియా సమావేశంలో పాకిస్థాన్‌లోని ఓ ప్రాంతం పేరు అందరిని ఆకర్షించింది. అదే కిరానా హిల్స్‌. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని సర్గోదా జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం పాక్‌ రక్షణశాఖకు ఎంతో కీలకం. ఆ దేశం ఇక్కడ తన అణు స్థావరాన్ని నిర్వహిస్తోందనే వాదనలు ఉన్నాయి. ఈ వ్యూహాత్మక ప్రాంతం సర్గోదా ఎయిర్‌బేస్‌కు 20 కి.మీ., కుషాబ్‌ అణుకేంద్రానికి 70 కి.మీ. దూరంలో ఉంది. స్థానికంగా ఓ కుగ్రామం పేరు మీదుగా ఈ కొండలకు కిరానా హిల్స్‌ అనే పేరు వచ్చింది. పాకిస్థాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక రిజర్వ్‌ ప్రాంతంగా ఇవి ప్రసిద్ధి చెందాయి. ఈ పర్వతాల కింద నిర్మించిన బలమైన కాంక్రీట్‌ గుహల్లో అణ్వాయుధాలను పాకిస్థాన్‌ నిల్వ చేసినట్లు సమాచారం.

సరిహద్దులో పాక్‌ దాడులను తిప్పికొట్టే క్రమంలో ఆ దేశంలోని కీలకమైన సైనిక స్థావరాలపై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ దాడులు చేసింది. 8 ఎయిర్‌ బేస్‌లను ధ్వంసం చేసింది. భారత్‌ దాడుల్లో సర్గోడాలోని ముషఫ్ ఎయిర్‌బేస్ రన్‌వే ధ్వంసమైనట్లు శాటిలైట్‌ ఫొటోల్లో తెలుస్తోంది. కిరానా హిల్స్ కింద ఉన్న భూగర్భ అణు నిల్వలకు ఈ రన్‌ వే అనుసంధానంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ అణు కేంద్రం సమీపంలో భారత్‌ దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో పాకిస్తాన్ అణ్వాయుధాలు నిల్వ చేసిన చోటు గురించి బయటకు తెలిసింది. దీనిపై ఆర్మీ అధికారులు మరింత సమాచారం సేకరిస్తున్నారు.

వాయుసేన నిర్వహణలో..

పాకిస్థాన్‌ రక్షణశాఖ తమ వాయుసేన స్థావరం కోసం 1970లో కిరాణా హిల్స్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఇక్కడే 4091 స్క్వాడ్రన్‌తో పాటు ఒక రాడార్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 1978-79లో పాకిస్థాన్ ఆర్మీ కోర్‌ ఆఫ్ ఇంజినీర్స్.. టెస్ట్‌ సైట్‌ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. అనంతర కాలంలో ఇక్కడ అణు కార్యక్రమాలకు సంబంధించి పరిశోధనలు, పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. దీని కోసం అనేక సొరంగాలు తవ్వారు. దాదాపు 46 చిన్నపాటి సొరంగాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా భారీ పేలుళ్లను తట్టుకునేలా రక్షణశాఖకు చెందిన పాకిస్థాన్‌ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ వర్క్స్‌ (ఎస్‌డీడబ్ల్యూ).. ప్రత్యేక సొరంగాలూ నిర్మించింది.

అమెరికా అంతరిక్ష నిఘా నుంచి తప్పించుకునేందుకు రాత్రిపూట తవ్వకాల పనులు చేపట్టింది. ఇక్కడి వన్యప్రాణులను వేరేచోటికి తరలించింది. స్థానికంగా బహుళ-అంచెల రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసింది. గతంలో కిరానా హిల్స్‌ సొరంగాల్లోని ఒకదాంట్లో చైనా తయారీ ఎం-11 క్షిపణులను పాక్‌ నిల్వచేయగా.. అమెరికా నిఘావర్గాలు ఈ విషయం పసిగట్టాయి. దీంతో వాటిని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించింది. అయితే.. క్లింటన్‌ హయాంలో ఈ ప్రాంతంపై అమెరికా తన దృష్టిని నిరంతరం కొనసాగించడంతో అణు కార్యక్రమాలను ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని గుర్తుతెలియని ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. అయినప్పటికీ.. ఇక్కడ అణ్వాయుధాలను నిల్వ ఉంచిందనే కథనాలు ఉన్నాయి.

Tags

Next Story